Andhra PradeshHome Page Slider

పర్చూరుకు ఆమంచి కృష్ణమోహన్ జగన్ క్లారిటీ

175కి 175 నియోజకవర్గాలు గెలవాలన్న లక్ష్యంగా పనిచేస్తోన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందుకు సంబంధించి ఒక్కో అడుగు వేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నియోజకవర్గంలో బలమున్న నాయకులను, బలం లేని వారిగా విభజిస్తూ… ఇప్పటికే వడపోత మొదలుపెట్టిన జగన్… తుది జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారట. సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి పూర్తి స్థాయి విజయాన్ని అందిస్తాయని నమ్ముతున్న జగన్… అభ్యర్థుల ఎంపిక త్వరగా కనిచ్చేసి.. ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా సమాచారం తీసుకున్న జగన్… ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చేందుకు ఒక ప్లాన్ సిద్ధం చేశారట.

ముఖ్యంగా చీరాల, పర్చూరు నియోజకవర్గాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్‌, గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనను చీరాల కాకుండా పర్చూరు వెళ్లాలంటూ పార్టీ కోరడంతో ఆయన ఎటువైపు వెళ్లాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం గందరగోళానికి చెక్ పెడుతూ… సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చీరాల నియోజకవర్గం నుంచి బలరామ్ తనయుడు వెంకటేష్ పోటీ చేస్తారని స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచిని పర్చూరుకు వెళ్లాల్సిందిగా జగన్ కోరారట. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయిన నేతలను ఏకతాటిపైకి తెచ్చుకోవాలని ఇద్దరు నాయకులను జగన్ కోరినట్టుగా సమాచారం.

గత రాత్రి ఆమంచి, బలరామ్ వర్గీయులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరణం బలరామ్ తనయుడు చీరాలలో పోటీ చేస్తారని, ఆమంచి పర్చూరు వెళ్తారని జగన్ చెప్పగా.. ఇద్దరు నేతలు అందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కరణం బలరామ్ తనయుడు వెంకటేష్, ఉమ్మడి జిల్లాలోని చీరాల, అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లో ఎక్కడికి పంపాలన్నదానిపైనా పార్టీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఐతే చీరాలలో వెంకటేష్ ఐతే ఈజీగా గెలుస్తారని పార్టీ సర్వేలో తేలిందట. అటు టీడీపీ, ఇటు వైసీపీ శ్రేణులను సమన్వయం చేసుకుంటే విజయం నల్లేరుపై నడకన్న భావన పార్టీలో ఉంది. అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్, పర్చూరుకు పంపించడం వల్ల అక్కడ బలమైన టీడీపీ నేత యేలూరి సాంబశివరావును, ఆమంచి కచ్చితంగా ఓడించగలుగుతారన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు.