ఆల్ ద బెస్ట్ సిద్దూ… ప్రత్యర్థికి డీకే శుభాకాంక్షలు
సీఎం పీఠంపై డీకే ఆశలు వదిలేసుకున్నారా?
పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్న డీకే శివకుమార్
ఇవాళ సీఎం ఎవరో ప్రకటించనున్న హైకమాండ్
డీకేను చల్లబర్చేలా పార్టీ పెద్దల ముందస్తు వ్యూహాలు
ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న ఇద్దరిలో ఒకరైన రాష్ట్ర పార్టీ చీఫ్ డీకే శివకుమార్, ఢిల్లీ పర్యటనను హఠాత్తుగా రద్దు చేసుకోవడంతో కర్ణాటక రాజకీయాలు ట్విస్ట్ తీసుకున్నాయి. ఢిల్లీ రావొద్దంటూ పార్టీ హైకమాండ్ ఆదేశించడంతో, అనారోగ్యం కారణంగా తాను ఢిల్లీ వెళ్లడం లేదని డీకే చెప్పారు. బీజేపీ నుంచి కర్నాటకను విముక్తి చేస్తారని మీపై నమ్మకం ఉందని సోనియా తనపై భరోసా ఉంచారన్నారు డీకే. ఆమె అనుకున్నట్టుగా పార్టీని విజయతీరాలకు చేర్చానన్నారు. పార్టీ విజయానికి కారకులెవరన్నది పార్టీ ఆలోచించాల్సిన ధర్మం పార్టీపై ఉందన్నారు.

సీఎం పీఠం కోసం తాను పార్టీపై తిరుగుబాటు ప్రకటించను. ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయనన్నారు. దేశ రాజధానిలో ఉన్న సిద్ధరామయ్య పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర నేతలతో భేటీ కానున్నారు. ఐతే ఇప్పటి వరకు సిద్ధరామయ్య, ఢిల్లీ పెద్దలతో మాట్లాడలేదని, పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ఎమ్మెల్యేలు ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారన్నదానిపై ఇద్దరు ఢిల్లీ దూతలు ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపారు. 135 మంది ఎమ్మెల్యేలు ఏకవాఖ్య తీర్మానాన్ని ఆమోదించారని, చెప్పిన డీకే, 135 మంది ఎమ్మెల్యేలే తన శక్తి అన్నారు. “ధైర్యం ఉన్న ఒక్క వ్యక్తి మెజారిటీ సాధించాడు, నేను దానిని నిరూపించుకున్నాను. గత ఐదేళ్లలో ఏం జరిగిందో నేను వెల్లడించకూడదనుకుంటున్నాను” అని ఆయన విలేకరులతో అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లోబర్చుకున్నప్పటికీ నేను పార్టీని సురక్షితంగా ఉంచానన్నారు. మా ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్లినప్పుడు ధైర్యం కోల్పోలేదన్న డీకే, ధైర్యంగా బాధ్యతలు స్వీకరించాన్నారు. మల్లికార్జున్ ఖర్గే సీనియర్ నాయకుడు, సోనియా, రాహుల్ గాంధీలపై తనకు నమ్మకం ఉందన్నారు. సీఎం ఎవరన్నది వారే తేల్చుతారన్నారు. పార్టీ వ్యూహకర్త, ట్రబుల్ షూటర్‌గా శివకుమార్ పేరు సంపాదించుకుంటే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలోని అతిపెద్ద మాస్ లీడర్‌లలో ఒకరు. శివకుమార్‌పై పలు అవినీతి కేసుల్లో విచారణ జరుగుతుండగా, సిద్ధరామయ్యకు క్లీన్ ఇమేజ్ ఉంది. 75 ఏళ్ల సిద్ధరామయ్య, ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పాడు.

