BusinessHome Page SliderHoroscope TodayNews

ఏఐ ట్రైనర్లకు భారీ డిమాండ్

క్లాసుకు రూ.23 లక్షల సంపాదన!
ఇకపై ఏఐ స్కిల్స్ ఉంటేనే జాబ్ లు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా టెక్, ఫైనాన్స్ రంగాలలో ఉద్యోగాల ముప్పుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఇదే ఏఐ సరికొత్త హై-పేయింగ్ ఉద్యోగాలకు ద్వారాలు తెరుస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలకు ఏఐ టూల్స్ వినియోగంపై శిక్షణ ఇచ్చే ‘ఏఐ ట్రైనర్లకు’ అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. వీరు ఒక్కో క్లాస్‌కు ఏకంగా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. సాఫ్ట్‌బ్యాంక్ మాజీ ఇన్వెస్టర్లు ఫెలిపే సినిస్టెర్రా, డేవ్ వాంగ్ అమెరికాలో స్థాపించిన ‘వాల్‌స్ట్రీట్ ప్రాంప్ట్’ అనే సంస్థ ఇప్పుడు బ్యాంకర్లు, ఫండ్ మేనేజర్లకు ప్రత్యేకంగా ఏఐ శిక్షణ ఇస్తోంది. వీరు ఒక్కో క్లాస్‌కు ఏకంగా 25,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.23 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ శిక్షణా తరగతులకు మార్కెట్లో డిమాండ్ ఎంతలా ఉందంటే, గత రెండు నెలలుగా క్లాసుల కోసం వచ్చిన ఆర్డర్లు భారీగా పేరుకుపోయి వెయిటింగ్ లిస్ట్ నడుస్తోంది.

ఈ ట్రైనర్లు చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని వంటి అధునాతన ఏఐ టూల్స్‌ను ఉపయోగించి ఆర్థిక రంగంలో ఎక్కువ సమయం తీసుకునే పనులను సులభతరం చేయడం నేర్పిస్తున్నారు. ముఖ్యంగా డేటా ప్రాసెసింగ్, రీసెర్చ్, కంపెనీల ఫైనాన్షియల్ అనాలసిస్ వంటి పనులను నిమిషాల్లో ఎలా పూర్తి చేయాలో బ్యాంకింగ్ నిపుణులకు శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఒక కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్టులను విశ్లేషించడానికి గంటల కొద్దీ సమయం పట్టేది, కానీ ఇప్పుడు ఏఐ టూల్స్‌కు సరైన ‘ప్రాంప్ట్’ ఇవ్వడం ద్వారా కేవలం 90 సెకన్లలోనే కీలకమైన ఆర్థిక అంచనాలను, స్ప్రెడ్‌ షీట్‌లను సిద్ధం చేయవచ్చని నిరూపిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏఐ టూల్స్ వాడకం తెలిసిన ఉద్యోగులు, సాధారణ ఉద్యోగుల కంటే 10 నుంచి 20 రెట్లు వేగంగా, మెరుగ్గా పని పూర్తి చేయగలుగుతున్నారు. దీనివల్ల ఆర్థిక సంస్థల్లో సాంప్రదాయ ఉద్యోగులకు, ఏఐ నైపుణ్యం గలవారికి మధ్య కార్పొరేట్ అంతరం వేగంగా పెరుగుతోంది. భవిష్యత్తులో కేవలం సాంప్రదాయ నైపుణ్యాలు మాత్రమే ఉండి, ఏఐ వాడకం తెలియని వారికి ఉద్యోగాలు లభించడం కూడా చాలా కష్టంగా మారవచ్చని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.