నటుడు రాజేంద్రప్రసాద్‌కు పుత్రికా వియోగం
ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి(38) హఠాత్తుగా కన్నుమూశారు. శుక్రవారం ఆమెకు చాతీలో నొప్పి అని చెప్పడంతో నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూనే ఆమె తుదిశ్వాస విడిచారు. ఇంత చిన్నవయసులోనే గుండెపోటుకు గురవడంతో తండ్రి రాజేంద్రప్రసాద్ షాక్‌కు గురయ్యారు. గతంలో ఒక ఆడియో రిలీజ్ కార్యక్రమంలో కూడా తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నా 10వ ఏటనే తన తల్లి చనిపోతే, తన కుమార్తెలో తల్లిని చూసుకుంటున్నా అని పేర్కొన్నారు. తన కుమార్తె లవ్ మ్యారేజ్ చేసుకుందని కోపంతో కొన్నాళ్లు మాట్లాడలేదన్నారు. తనను ఒకసారి ఇంటికి పిలిచి తల్లీ తల్లీ అనే పాటను వినిపించానని పేర్కొన్నారు. సినీ ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శిస్తున్నారు.