Andhra PradeshHome Page Slider

ఘనంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 39,40 వ స్నాతకోత్సవం

•శాస్త్ర సాంకేతిక పరిశోధనా రంగాల్లో అపార కృషి చేస్తున్న యువతరంగం
•అభివృద్ధి వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు యువతే మార్గదర్శకం
•ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్ అబ్దుల్ నజీర్

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 39&40 వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. విద్యార్థులకు భావి సూచకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం నిలిచింది. రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిశోధనా రంగాల్లో అపార కృషి చేస్తున్నది యువతరంగం అనీ అభివృద్ధి వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు యువతే మార్గదర్శకం అని యువతను కొనియాడారు. ప్రపంచ దేశాల అనుసంధానం జరుగుతున్న నేటి విప్లవాత్మక పరిణామ క్రమంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువతదే ప్రధాన పాత్ర అని తెలిపారు.యువత భవిష్యత్తు నిర్మాతలు అనీ ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక పరిశోధనలే జ్ఞానానికి మూల స్థంభాలుగా ప్రపంచ గతిని మారుస్తున్నాయని వివరించారు.

భారతదేశం ఉన్నత విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందనీ నూతన జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యం 2035 సం” నాటికి ఉన్నత విద్యాభ్యాసంలో విద్యార్థులు 50% కి చేరు కోవడమే అని పేర్కొన్నారు.శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన ఫలితాలు ప్రపంచ సవాళ్లను అధిగమించి పర్యావరణ సుస్థిరతను, నైతికతను, మానవతకు బలాన్ని చేకూరుస్తాయని సూచించారు. ఆధునిక ప్రపంచానికి అత్యాధునిక వరం కృత్రిమ మేధ అనీ విద్యార్థులు సాధించే సాంకేతిక ఫలితాలు సమాజంలోని అన్ని రంగాలను వృద్ధిలోనికి తీసుకురావాలని సూచించారు. పరిశోధన అనేది ప్రపంచ రహస్యాలను తెలుసుకోవడానికి గొప్ప ప్రయత్నం అని శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాల్లో విద్యార్థులు సాధించే ప్రగతి ప్రపంచ తలరాతను మార్చాలని సూచించారు.

జ్ఞాన సముపార్జన వ్యక్తిగత సాధనగా భావించరాదనీ ప్రపంచ మానవాళిని వృద్ధిలోకి తెచ్చే ఉన్నతాశయ సాధనామార్గం అని తెలిపారు.వ్యవస్థాపకత అనే ఆలోచన దేశంలోని నిరుద్యోగ సమస్యను నివారించే గొప్ప ప్రయత్నం అని విద్యార్థులకు సూచించారు.”ఆత్మనిర్బరభారత్, స్టార్టప్ ఇండియా” అనే భారత నినాదాలు యువతకు గొప్ప కాంతి కిరణాలని అభివర్ణించారు.భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక స్టార్టప్ కేంద్రాలతో విలసిల్లుతోందని పేర్కొన్నారు. ప్రతీ ప్రయోగం ఒక సవాలుగా తీసుకోవాలని అందుకు ఉదాహరణే చంద్రయాన్ -3 అని యువతకు దిశా నిర్దేశం చేశారు. యువత సాధించే వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు సహకారం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని, యువ మేధావులంతా వారి భవిష్యత్తు మార్గం ప్రకాశవంతం చేసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

ప్రఖ్యాత సంపాదకులు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత నేటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ గ్రహీత మాన్యశ్రీ పాలగుమ్మి సాయినాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గొప్ప భాష వారసత్వ చరిత్ర గలిగినదని వివరించారు. నేడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన పాలగుమ్మి సాయినాధ్ మాట్లాడుతూ.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా వ్యవహరించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి. రాజశేఖర్ విశ్వవిద్యాలయ ఉన్నత విద్యా ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా విశేష ప్రతిభ కనబరిచిన పరిశోధక విద్యార్థులకు బంగారు పతకాలు గవర్నర్ చేతుల మీదుగా అందించారు. నేటి స్నాతకోత్చవం లో 260 పీ హెచ్ డీ పట్టాలు,235 బంగారు పతకాలు,18 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అందజేసింది.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య బి .కరుణ, రెక్టార్ ఆచార్య పి. వర ప్రసాదమూర్తి, విశ్వవిద్యాలయ ప్రాచార్యులు,డీన్ లు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.