Andhra PradeshHome Page Slider

దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరా మస్తాన్

చిలకలూరిపేట పట్టణ శివారు పురుషోత్తమపట్నంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న దత్తాత్రేయ జయంతి ఉత్సవాలలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ ఆరా మస్తాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరా మస్తాన్‌కు ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. శ్రీ సచ్చిదానంద దత్త పీఠానికి చెందిన వేదపండితులు ఆరా మస్తాన్‌ను ఆశ్వీరదించి, దుశ్సాలువతో సత్కరించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వహకుల కోరిక మేరకు సచ్చిదానంద స్వామి వార్ల దేవతా ఉత్సవ విగ్రహాలను ఊరేగింపులో భాగంగా వేద పండితులకు ఆరా మస్తాన్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా దత్తాత్రేయుని నామస్మరణతో మార్మోగింది. విద్యుత్ దీపాల కాంతుల మధ్య మరింత శోభ సంతరించుకుంది. ప్రత్యేకంగా కోలాట భజన బృందం నృత్యంతో భక్త జనులను ఆకట్టుకున్నారు. ఈ దైవ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ ఆరా మస్తాన్‌పై స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల కులమతాలకు అతీతంగా ఆరా మస్తాన్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ప్రస్తావించి ఆలయ నిర్వాహకులు, వేదపండితులు కొనియాడారు.

భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి, చిలకలూరిపేట ప్రజలకు శాయశక్తులా సాయమందిస్తానని ఈ సందర్భంగా ఆరా మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలపీఠ సంస్థానధీశులు శ్రీశ్రీశ్రీ యోగీశ్వరానంద స్వామిజీ ఆరా మస్తాన్‌కు వేద ఆశీర్వచనం అందించారు.