Home Page SliderNational

లిక్కర్ స్కామ్‌లో సిసోడియా అరెస్టుపై ఆప్ దేశ వ్యాప్త ఆందోళనలు

ఢిల్లీతోపాటుగా, బెంగళూరు, చండీగఢ్, భోపాల్, అనేక ఇతర నగరాల్లో కూడా ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు నిరసనల్లో పాల్గొన్నారు. సిసోడియా అరెస్టుపై ఆప్ ఈరోజు ‘బ్లాక్ డే’ పాటించనున్నట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. సిసోడియాను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయంతో సహా దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు. నిరసనల విషయంలో శాంతిభద్రతల పరిరక్షణకు తగిన ఏర్పాట్లు చేశామని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. శాంతి భద్రతలు కాపాడేందుకు సమర్థవంతమైన, పటిష్టమైన పోలీసు ఏర్పాట్లు చేశామన్నారు లా అండ్ ఆర్డర్ ప్రత్యేక పోలీసు కమిషనర్ దేవేంద్ర పాఠక్ ANIకి తెలిపారు. మనీష్ సిసోడియాను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ రోజు దేశ రాజధానిలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనకు యోచిస్తోంది.

దేశ రాజధానిలో కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో మనీష్ సిసోడియా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2021 పాలసీ రూపకల్పనలో మద్యం కంపెనీలు పాలుపంచుకున్నాయని, దీని కోసం “సౌత్ గ్రూప్” అని పిలిచే మద్యం లాబీ ద్వారా ₹ 30 కోట్ల వరకు కిక్‌బ్యాక్‌లు చెల్లించారని సీబీఐ వాదిస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిసోడియాను ఆదివారం ఎనిమిది గంటల పాటు విచారించిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. మనీష్ సిసోడియా అరెస్టును చాలా మంది సిబిఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని, రాజకీయ ఒత్తిడి కారణంగా ఆధారాలు లేకుండా బలవంతంగా అరెస్టు చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. సిసోడియా ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రధాన కార్యాలయంలో రాత్రి గడిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎయిమ్స్‌కు చెందిన వైద్యుల బృందం సిబిఐ ప్రధాన కార్యాలయంలో ఆప్ నేతకు వైద్య పరీక్షలు నిర్వహించింది.