NationalNewsNews Alert

అన్నం పెట్టినోడికి సున్నం పెడుతున్న శ్రీలంక

Share with

హిందూ సముద్ర జలాల్లో చైనా కుప్పిగంతులు

అవసరంలో అండగా నిలిచాం. సంక్షోభంలో సాయం చేశాం. ఉగ్రవాదంతో బెదిరిపోతే భరోసా ఇచ్చాం. పొరుగు దేశం కదా అని స్నేహపూర్వకంగా వ్యవహరించాం. కానీ.. శత్రువులతో చేతులు కలిపింది. చైనాకు తలొగ్గి భారత్ కు నష్టం చేకూర్చే విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. ఇదీ.. శ్రీలంక నైజం. ఎన్ని అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదు. ఆందోళన వ్యక్తం చేసినా పరిగణలోకి తీసుకోలేదు. కానీ.. చైనా ఏం చెప్పిందో అదే చేసింది. ఏం కోరిందో అదే నెరవేర్చింది. ఇదీ.. శ్రీలంక ద్వంద్వనీతి. దుర్భేధ్యమైన భారత్ మిలటరీ వ్యవస్ధపై కన్నేసిన డ్రాగెన్ .. శ్రీలంక అండతో వివాదాస్పద గూఢచర్య నౌక యువాన్ వాంగ్-5ని శ్రీలంక సముద్ర జలాల్లో నిలిపింది. ఈ పరిణామం భారత్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. హంబన్‌టోట్ పోర్టులో చైనా నౌకను నిలపడానికి శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్ ఎంతలా మొత్తుకుంటున్న వినకుండా తమ సముద్ర జలాల్లోకి ఆ నౌకను ప్రవేశ పెట్టింది. పైకి ఇది రీసెర్చ్, సర్వే నౌక అని చెబుతున్నా.. పూర్తిగా గూఢచర్యం కోసమే దీనిని వినియోగిస్తున్నారని భారత్ ఆరోపిస్తోంది. అసలు ఈ నౌక వల్ల భారత్ కు కలిగే నష్టాలేంటి ? భారత్ భయాలకు కారణాలేంటి ?

అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా రూపొందించిన నౌక యువాన్ వాంగ్-5. పైకి చెప్పే కారణాలకు భిన్నంగా శ్రీలంకను వేదికగా చేసుకుని చైనా తన కుంతంత్రాలకు తెరతీసింది. హైటెక్ నౌకగా పేర్కొనే యువాన్ వాంగ్-5.. బాలిస్టిక్‌ క్షిపణులు, ఉపగ్రహాల ఆనవాళ్లను ఎప్పటికప్పుడు ట్రాకింగ్‌ చేసి.. వాటి నివేదికలను చైనాకు అందజేయనుంది. ముఖ్యంగా భారత్ పై తరచూ కయ్యానికి కాలు దువ్వే బ్లడీ డ్రాగెన్.. భారత రక్షణ వ్యవస్ధల ఆనుపానుల్నీ పసిగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చైనా నుండి హిందూ సముద్రం మీదుగా శ్రీలంక వెళుతూ కీలక అంశాలను సేకరించిందేమోనన్న భయం ఇప్పుడు భారత్ ను వెంటాడుతోంది. అంతేకాకుండా హిందూ మహా సముద్రంపై పట్టు పెంచుకోవడంతో పాటు భారత్ చుట్టుపక్కల దేశాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కొమ్ముకాస్తూ భారత్ పైకి ఎగదోస్తోంది. నేపాల్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ .. మనపై విద్వేషాన్ని నింపుతోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అన్ని రకాలుగా వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ .. భారత్ పై విషాన్ని వెళ్ళగక్కేలా చేస్తోంది. ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా చైనా ఒత్తిడికి తలొగ్గి వ్యవహరిస్తున్నాయి. చేసేది లేక భారత్ ను శత్రు దేశంగా చూస్తున్నాయి. ఇప్పుడు శ్రీలంకను కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు చైనా వ్యూహాలు రచించింది. దాని కుటిల పన్నాగాలకు భయంతో ఆ బుడత దేశం .. భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఆ నిర్ణయమే భారత్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మానవతా సాయం చేసేందుకు, భారత్ ఆపన్న హస్తం అందించింది. కోట్ల రూపాయల నిధులను అంద జేసింది. కరోనా కష్ట కాలంలో మందులను కూడా పంపింది. అయినా ఆ దేశానికి కించత్తు కూడా విశ్వాసం లేకుండా పోయింది. చైనా చంకలో చేరి పిచ్చి వేషాలు వేస్తోంది.


ఈనెల 11వ తేదీనే చైనా గూఢచర్య నౌక శ్రీలంక చేరుకోవాల్సి ఉండగా.. భారత్ అభ్యంతరాలను ఆ దేశానికి తెలియచేస్తూ లేఖ రాసింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు యువాన్ వాంగ్-5కి అనుమతి ఇచ్చేదే లేదని తెలియ చెప్పింది. అవేమీ డ్రాగన్ పట్టించుకోలేదు. శ్రీలంక లేఖను తుడిచి అవతలేసింది. తన నౌకను శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టులోకి ప్రవేశపెట్టింది. ఈనౌక చేరిన హంబన్‌తోట పోర్టును ప్రస్తుతం చైనాయే నిర్వహిస్తోంది. చైనా తమ దేశానికి ఇచ్చిన అప్పులు తీర్చ లేకే ఈ పోర్టును 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చింది. ఇందుకు గాను చైనా 1.12 బిలియన్ డాలర్లను శ్రీలంకకు చెల్లించింది. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణం కోసం చైనా 11, 945 కోట్లు ఖర్చు చేసింది. చైనా నుండి శ్రీలంకకు దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులను ఈ పోర్టులోనే దిగుమతి చేుకుని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ ఉంటారు. పైగా ఈ పోర్టు యూరప్‌ ఆసియాల మధ్య ప్రధాన నౌకా మార్గానికి అతి చేరువలో ఉండడం గమనార్హం. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తుంటే చైనా ఓ వ్యూహం ప్రకారమే ఇదంతా చేస్తూ వచ్చింది. దీనివల్ల భారత్ కు సంబంధించిన అన్ని విషయాలను అతి దగ్గరగా పరిశీలించవచ్చన్నది చైనా ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఆందోళన రేకెత్తించే అంశం. అక్కడ ఏం జరుగుతుందో .. శ్రీలంకకు కూడా తెలియని పరిస్ధితి ఏర్పడింది. ఈ పరిణామాల వల్ల భారత్ రక్షణ వ్యవస్ధకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రక్షణ శాఖాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీలంక వ్యవహారాన్ని ముందే పసిగట్టిన భారత్.. తగు జాగ్రత్తల్లో పడింది. ముఖ్యంగా ఒడిసాలోని చాందీపూర్‌లో ఉన్న క్షిపణి పరీక్ష కేంద్రాలను చైనా తన రాడార్‌ పరిధిలోకి తీసుకునే అవకాశాలున్నాయన్న భయం వెంటాడుతోంది.


అంతర్జాతీయ సమాజంలో భారత్ కు ఉన్న పేరు ప్రతిష్టలను చూసి ఓర్వలేని కుళ్ళుబోతు చైనా .. తన దుష్ట పన్నాగాలను శ్రీలంక అండతో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా భారత్ క్షిపణుల రేంజ్ ను అంచనా వేయడానికి దానికిస తగిన స్ధలం లభించింది. అంతేకాకుండా దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలపై నిఘా పెట్టగల సామర్ధ్యం చైనా నౌకకు ఉంది. అందుకే అది రీసెర్చ్ నౌక కాదని .. భారత్ పై పూర్తిగా గూఢచర్యం నెరపేందుకే అక్కడ తిష్ట వేసిందని భారత్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చగా మారింది. కయ్యానికి ఉవ్వెళ్ళూరుతున్న చైనా నైజాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. చూద్దాం.. చైనా ఎత్తుగడలను .. కుతంత్రాలను భారత్ ఎలా తిప్పికొట్టబోతోందో. ఎలా స్పందించబోతోందో.