చెన్నైలో చెస్ ఒలింపియాడ్ పండుగ సంబరాలు
రష్యాలో జరగాల్సిన 44 వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలుపెట్టడంతో దాని ఆతిథ్యం భారత్‌లోని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంకు మారింది. అతి తక్కువ సమయంలోనే భారీ ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం. ఈ పోటీల కోసం అమెరికా, జర్మనీ, మలేషియాతో సహా 190 దేశాల నుండి దాదాపు 1700 మంది చెస్ క్రీడాకారులు చెన్నైకు తరలివచ్చారు. ఈ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు. వేడుకలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు.
స్టేడియంలో ఎక్కడచూసినా బ్లాక్ అండ్ వైట్ చెస్ గడులు కనిపించేలా తీర్చిదిద్దారు. ప్రారంభ వేడుకలో భారత సంస్కృతి ప్రతిబింబించే సాంసృతిక కార్యక్రమాలు అందరినీ అబ్బురపరిచాయి. ఈ పోటీలు జూలై 29 మొదలుకొని ఆగస్టు 10 వరకూ జరుగుతాయి. చెన్నై ప్రజలు ఈ చెస్ ఒలింపియాడ్‌ను ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు A.R. రెహమాన్ ఈ ఉత్సవానికి పాట కూర్చి దృశ్యరూపం ఇచ్చారు. ఈ ఆటకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతి పెద్ద చెస్ బోర్డుపై రాజు, మంత్రి, సైనిక వేషాలు మనుషులే ధరించి ఆడుతున్నట్లు వీడియోను రూపొందించారు.
ఇది కళ్లకు కట్టినట్లు చెస్ నిజంగా యుద్ధం జరుగుతున్న అనుభూతిని ప్రజలకు కలిగించింది. ప్రభుత్వం చూపరుల కోసం అనేక సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అక్కడి ప్రజలు రంగవల్లులతో తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.