డబ్బు సంపాదించడం వీళ్లకు తెలిసినట్టుగా ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదేమో!?
మార్వాడీల గురించి మనం ఎప్పుడూ వింటుంటాం. వ్యాపారులు చేయడంలో మార్వాడీలను మించినవారుండరంటారు. అలాగే పలుకుబడి ఎక్కువగా ఉండే రంగాల్లో గుజరాతీలను తీసిపోయేవారుండరంటారు. అటు అధికారం, ఇటు ఆర్థికరంగం రెంటినీ ఇప్పుడు గుజరాత్ శాసిస్తోంది. అమెరికా, ఇంగ్లాండ్‌తో సహా పలు ఆఫ్రికా దేశాల్లో గుజరాతీలు అటు రాజకీయాల్లోనూ, ఇటు వ్యాపార రంగాల్లోనూ రాణిస్తున్నారు. దేశంలోని బిజినెస్ కేపిటల్ గా గుజరాత్ గురించి చెప్పుకుంటారు. దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈ పరంపర నగరాలకే పరిమితం కాలేదు.

మనం హైదరాబాద్ మాదాపూర్ గురించి విన్నాం. ప్రపంచ ఐటీకి రాజధానిగా ఈ ప్రాంతం విలసిల్లుతుంటే.. గుజరాత్ కచ్‌లోని మాదాపర్ ‘మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం’ గా రికార్డుల్లోకి ఎక్కింది. అందుకు కారణం ఏంటంటే… భుజ్ శివార్లలోని గ్రామ ప్రజలు అక్షరాల 7 వేల కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో దాచుకున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత డబ్బుంటే అంత బ్యాంకుల్లో ఉంచుకుంటారో ఊహించుకోండి.

మాదాపర్‌లో పటేల్ కమ్యూనిటీ ఎక్కువగా నివసిస్తుంది. ఈ గ్రామ జనాభా 2011లో 17,000 కాగా, ప్రస్తుతం 32,000. గ్రామంలో HDFC బ్యాంక్, SBI, PNB, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో సహా 17 బ్యాంకులు ఉన్నాయి. ఇన్ని బ్యాంకులు ఒక గ్రామంలో ఉండటం అసాధారణ విషయం. అయితే ఇంకా చాలా చాలా బ్యాంకులు ఇక్కడ తమ శాఖలను తెరిచేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇంత సంపద ఈ గ్రామంలో ఉండటానికి కారణాలు అనేకం. NRIల కుటుంబ సభ్యులు ఏటా పోస్టాఫీసులు, స్థానిక బ్యాంకుల్లో ఏటా కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. గ్రామంలో దాదాపు 20,000 ఇళ్లు ఉండగా, దాదాపు 1,200 కుటుంబాలు విదేశాల్లో ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల్లో నివసిస్తున్నాయి.

సెంట్రల్ ఆఫ్రికాలోని నిర్మాణ వ్యాపారాలలో గుజరాతీలు అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. గుజరాత్ నుంచి వెళ్లి చాలా మంది UK, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్‌లో కూడా నివసిస్తున్నారు. వీరంతా విదేశాలలో ఉంటున్నా… తమ గ్రామంతో సంబంధాలు కలిగి ఉంటారు. వారు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ… తమ సొంత ఊళ్లోనే డబ్బును డిపాజిట్ చేసుకోడానికి ఇష్టపడతారని జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు పరుల్బెన్ కారా తెలిపారు. గ్రామంలోని జాతీయ బ్యాంకు స్థానిక బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ భారీగా డిపాజిట్లు రావడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. నీరు, పారిశుధ్యం, రోడ్లు వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలతో అలరారుతుంది. బంగ్లాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలువలు, దేవాలయాలు ఉన్నాయని మేనేజర్ చెప్పారు.

