భారత గడ్డపై అరుదైన చీతా
చిరుత పులుల్లో అరుదైన జాతికి చెందిన చీతాలు 74 ఏళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు పెట్టాయి. నమీబియాలోని విండ్‌హాక్ నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను ప్రధాని మోదీ శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోని ప్రత్యేక క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టారు. ఆ తర్వాత మోదీ స్వయంగా కెమెరా చేతబట్టి ఈ చీతాల ఫొటోలు తీశారు. ప్రధాని పుట్టిన రోజునే జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన ఈ చీతాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అక్కడి నుంచి వీటిని భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో కునే నేషనల్ పార్క్‌కు తరలించారు.

1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయింది. తర్వాత వీటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఈ అరుదైన చీతాలు దేశంలో అంతరించిపోయాయని భారత ప్రభుత్వం 1952లో ప్రకటించింది. 4-6 ఏళ్ల వయసున్న 5 ఆడ, 3 మగ చీతాలు భారత వాతావరణానికి అలవాటయ్యే వరకూ జాగ్రత్తలు తీసుకుంటామని వన్యప్రాణి సంరక్షణ అధికారులు తెలిపారు. ఆ తర్వాతే ప్రజలు వీటిని తిలకించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.