NationalNews

తండ్రిపై ప్రేమను చాటుకున్న కుమార్తె

దీర్ఘకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కొత్త ఊపిరి లభించనుంది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఒక కిడ్నీని తన తండ్రికి ఇచ్చేందుకు సుముఖత చూపించినట్టు తెలుస్తోంది. దీంతో లాలూ త్వరలో సింగపూర్‌ వెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయనున్నారు. మూత్ర పిండాల మార్పిడి చికిత్స చేయించుకోవాలని లాలూకు సింగపూర్‌ వైద్యులు సూచించారు. దీంతో తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు రోహిణి ముందుకొచ్చారు.

అయితే.. తన ప్రాణం కాపాడుకొనేందుకు కుమార్తె కిడ్నీని స్వీకరించేందుకు లాలూ నిరాకరించినట్లు సమాచారం. కానీ కుమార్తె ఒత్తిడి చేయడంతోపాటు, కుటుంబ సభ్యులు కిడ్నీని దానం చేసినప్పుడు శస్త్ర చికిత్సలు సక్సెస్‌ అవుతున్న సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయని, అందువల్ల తన కిడ్నీని తీసుకోవడానికి అంగీకరించాలని రోహిణి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఆమె ఒత్తిడితో ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ నెల  20-24 మధ్య లాలూ మరోసారి సింగపూర్‌కు వెళ్లనున్నారు. ఆ సమయంలో అక్కడ కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ సర్జరీ చేయనున్నట్టు సమాచారం. లాలూ గత కొంతకాలంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు.