ఇంట్లో సిలిండర్ పేలి.. ఇద్దరు కార్మికుల దుర్మరణం
హైదరాబాద్ జీడిమెట్లలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివాసముంటున్న ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. జీడిమెట్ల పోలీసులు,ఘటనా స్థలంలోని స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మృతులు ఇద్దరు కూడా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.అయితే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 15 మంది కార్మికులను కుత్బుల్లాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన కాంట్రాక్టర్ అన్సారీ పనికి తీసుకువచ్చి స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు ఇప్పించారు. వీరందరూ కూడా పారిశ్రామిక వాడలోని మెఘా ఇంజినీరింగ్ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉదయం కొందరు పనికి వెళ్లగా..మరో 5 మంది ఇంట్లోనే ఉన్నారు.ఆ సమయంలో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి.దీంతో రాత్రి 8:15 గంటలకు కార్మికులు నివాసం ఉంటున్న ఇంట్లో నుండి భారీ పేలుడు శబ్దం వచ్చింది.ఆ శబ్దం విన్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ,పోలీసులకు సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు.పోలీసులు గదిలోకి వెళ్ళి పరిశీలించగా ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లుగా గుర్తించారు.మృతులు నబీరుద్దీన్,బీరేందర్‌గా నిర్దారించారు. కార్మికుల మధ్యలో జరిగిన గొడవల కారణంగా..వారే వీరిని హత్య చేసి సిలిండర్‌ను పేల్చినట్లు పోలీసులు,స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.అయితే ప్రమాదం జరిగిన అనంతరం మిగిలిన ముగ్గురు కార్మికులు అక్కడ లేకపోవటం కాడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందని చెప్పవచ్చు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.