’40 శాతం ఓట్లొచ్చినా ఎందుకు ఓడిపోయామంటే’..జగన్ కీలక వ్యాఖ్యలు
గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చినా ఓడిపోవడానికి గల కారణాలపై వైసీపీ అధినేత జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జరిగిన భేటీలో కీలక విషయాలు వెల్లడించారు. గత ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులకు 40 శాతం ఓట్లు వచ్చాయని, అది కూటమి ఓట్ల శాతం కంటే కేవలం 10 శాతం మాత్రమే తక్కువ అని గుర్తు చేశారు. అయినా ఓటమి పాలవడానికి కారణం కూటమి నేతల్లా నేను అబద్దాలు చెప్పలేకపోవడమే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి పాలనలోని దుస్థితిని, వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు. “గత ఐదేళ్లలో మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉంది. కొవిడ్ వల్ల ఆదాయం తగ్గినా హామీలు, నవరత్నాలు చక్కగా అమలు చేశాం. కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చూపించాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ప్రతీ హామీని ఎగ్గొట్టి, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. పథకాలన్నీ రద్దు చేశారు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఓటమి ఎదురయినప్పుడు, ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన కూటమి సర్కారు పరిస్థితి ఏమిటి? మనం మరో 30 ఏళ్లపాటు రాజకీయాలలో ఉంటాం. విలువలు, విశ్వసనీయత పాటిస్తూ ప్రజలకు సేవ చేద్దాం. మన కార్యకర్తలకు పెద్దన్నలా ఉంటా. జగన్ 2.0లో ప్రతీ కార్యకర్తకు తోడుంటా. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు వాళ్ల కాలర్ పట్టుకుంటారు. ఇసుక, మద్యం, పేకాట మాఫియాలు జోరుగా సాగుతున్నాయి. వారికి ప్రజలే గుణపాఠం చెప్తారు.” అంటూ వ్యాఖ్యానించారు. ఈ భేటీలో పలువురు మాజీ మంత్రులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు పాల్గొన్నారు.

