Home Page SliderTelangana

ముదిరి ఎండిపోతున్న నారుమళ్లు

చిన్నశంకరం పేట: వర్షాలు లేక అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖరీఫ్ కాలం కరిగిపోతున్నా.. వరుణుడు కరుణించడం లేదు. నిత్యం ఓ చిరుజల్లు కురిసి ఆగిపోవడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. చిన్నశంకరంపేట మండలంలో 14 వేలకు పైగా ఆయకట్టు సాగుకు అనువుగా రైతులు ఏర్పాటు చేసుకున్నారు. వేల రూపాయలు వెచ్చించి ఎరువులు తెచ్చుకున్నారు. వర్షం కురిస్తే నారుమళ్లు పనులు విస్తారంగా జరుగుతాయి. కానీ బోరు మోటార్లతో సాగునీరు అందించడం గగనంగా మారింది. రబీ పంటకు అందించిన నీరు, ఖరీఫ్‌లో సైతం ఆగి ఆగి వస్తున్నాయి. ఖరీఫ్‌లో నారుమళ్లకు పారించే నీరు సైతం రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేకపోవడం నేలలోకి నీరు ఇంకలేదు. దీంతో బోరు బావుల నుండి నీరు రావడం లేదు. ఖాజాపూర్, మిర్జాపల్లి, తుర్కల మాందాపూర్, కొండాపూర్ తదితర గ్రామాల్లో రోహిణి కార్తెలో నారుమళ్లు సాగు చేసినా నీరు లేక ఇప్పటికే ఎండిపోతున్నాయి. ప్రస్తుతం మళ్లీ నారుమళ్లు సాగు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని రైతులు వాపోతున్నారు.