రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా?
ఏపీలో రాజ్యసభ రగడ రాజుకుంటోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎదుర్కోని ఒక ఇబ్బందిని ఇప్పుడు ఎదుర్కొంటోంది. రాజ్యసభలో మొదటిసారి ఆ పార్టీ ఒక్కరంటే ఒక్క అభ్యర్థిని కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్తోంది. అనుకోని అదృష్టం కలిసి వస్తే… రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానమైనా అయినా గెలుచుకొని పరువు నిలబెట్టుకోవాలని టిడిపి భావిస్తోంది. వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలంటే టీడీపీకి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఒకరి రాజీనామాన్ని ఇప్పటికే స్పీకర్ ఆమోదించారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించారు. ఆ నలుగురు వైసీపీకి మద్దతిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి నుంచి టీడీపీకి మద్దతు పలికిన నలుగురు ఎమ్మెల్యేలు ఈసారి ఓటు వేసే అవకాశం దాదాపు లేనట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే వారిని ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉండేలా చేసేందుకు వైసిపి కసరత్తు తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే స్పీకర్ విచారణ సైతం చేశారు. రాజ్యసభ ఎన్నికకు ముందు మరోసారి విచారణ చేపట్టే అవకాశం కూడా ఉంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత టీడీపీ సీనియర్ నేతలుగా ఉన్న నలుగురు ఎంపీలు బీజేపీ గూటికి చేరారు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు పార్టీ మారగా.. ఆ పార్టీలో ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మిగిలారు. తాజాగా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. తగిన బలం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా.. లేదంటే వైసీపీలో ఉన్న అనిశ్చిత కలిసి వస్తోందన్న విశ్వాసంతో బరిలోకి దిగి.. విజయం సాధించవచ్చా… అన్న భావనలో ఆ పార్టీ ఉంది. గతంలోనూ రాజ్యసభ ఎన్నికల్లో బలం లేనప్పటికీ ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్లా రామయ్యను బరిలో దించి టీడీపీ అభాసుపాలయ్యింది. అయితే ఇప్పుడు చాలా మంది నేతలు వైసీపీపై గుస్సాగా ఉన్నారు. పలువురికి జగన్ టికెట్లు నిరాకరించడంతో.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే అనూహ్యంగా విజయం సాధించవచ్చేమోనని ఆ పార్టీ ఆశపడుతోంది. గతంలో నలుగురు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతివ్వడంతో అసెంబ్లీలో టీడీపీ అనూహ్య విజయాన్ని సాధించింది. దీంతో ఈసారి మరోసారి పోటీకి నిలబెట్టి సత్తా చాటాలని ఆ పార్టీ యోచిస్తోంది. అయితే నెంబర్లు మాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఆ పార్టీ ఏం చేస్తుందన్నది చూడాలి.

ఈ నేపథ్యంలో ఈనెల 27వ తారీకు జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసిపికి మూడు రాజ్యసభ స్థానాలు గెలవడం ఈజీయా, లేదంటే కష్టమా అనేది తేలాల్సి ఉంది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారందరూ కూడా టిడిపికి మద్దతు ఇచ్చే అవకాశం లేదన్న భావన కూడా ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు లోక్ సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితిలో, గెలుస్తామో లేదో తెలియని రాజ్యసభ ఎన్నిక మీద ఫోకస్ పెట్టడం కష్టమన్న భావన ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ వారందరూ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలని కూడా కోరే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వారికి అవకాశం ఇవ్వడం కష్టం. అంటే ముందు నువ్వు వెనక గొయ్యిలా పరిస్థితి. ఒకవైపు వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకునేందుకు అవకాశం ఉన్నా.. భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులతో చంద్రబాబు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి.

