సీఎం పదవిపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఎన్నికల ఫలితాలలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం సవాలుగా మారనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి చేరిన కార్యకర్తలు, అభిమానులు అతడే సీఎం అని నినాదాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి పదవిపై మథిరలో గెలుపొందిన భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన మధిర నియోజక వర్గంలో సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి కమల రాజుపై భారీ మెజార్టీతో గెలుపొందారు. తనకు సీఎం పదవి ఇస్తే బాధ్యతగా స్వీకరించి పని చేస్తానని హామీ ఇస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ పాలన వచ్చిందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని, కౌంటింగ్ పూర్తయ్యాక ఎమ్మెల్యేలు అందరూ సమావేశమై, నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోపక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిపై అధిష్టానానిదే నిర్ణయమన్నారు.

