బెల్లంపల్లి పట్టం కట్టేదెవరికి?
సింగరేణి బొగ్గుగనుల ఖిల్లాగా బెల్లంపల్లికి పేరు. 2018 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వినోద్, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారు. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో దుర్గం చిన్నయ్య ఇప్పటి వరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా ఆయన మరోసారి వినోద్‌తో తలపడుతున్నారు. గతంలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్‌పై చిన్నయ్య 11 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనను ఎదుర్కోనున్నారు. బీజేపీ నుంచి శ్రీదేవి పోటీ చేస్తున్నారు. దుర్గం చిన్నయ్య వరుసగా మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నప్పటికీ, ఈసారి ఆయన చుట్టూ వివాదాలు కాకరేపుతున్నాయ్. ఐతే ఈసారి విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే వినోద్ దీమాతో ఉన్నారు. ఇక్కడ కూడా పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగే అవకాశం ఉంది.

బెల్లంపల్లి (ఎస్సీ) అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం పోలింగ్ బూత్‌లు 227 ఉండగా, పురుషులు 84,790, స్త్రీలు 84,796 ట్రాన్స్‌జెండర్లు12 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 1,69,598 ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో మాల, మాదిగలతోపాటుగా ఇతర ఎస్సీ జనాభా అధికంగా ఉంది. ఇక్కడ ఇతర ఎస్సీలు 15 శాతం ఉండగా, ఇతర ఎస్టీలు 8 శాతం, ఇతర బీసీలు 11 శాతం మేర ఉన్నారు. మున్నూరు కాపులు 10 శాతానికిపైగా ఉన్నారు. మాలలు ఏడున్నర శాతం, మాదిగలు 4 శాతం ఉన్నారు. ఓసీలు సుమారుగా 5 శాతం వరకు ఉన్నారు. గోండ్లు, మాలలు ఐదేసి శాతం చొప్పున ఉన్నారు. యాదవులు, తెనుగు వర్గం వారు నాలుగేసి శాతం చొప్పున ఉన్నారు. ఇతరులు 15-18 శాతం వరకు ఉన్నారు.

