Andhra PradeshHome Page Slider

ఘనంగా ఆరా ఫౌండేషన్ ప్రగతి నివేదన సభ

ఆరా ఫౌండేషన్ చైర్మన్ మస్తాన్ సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి ప్రగతి నివేదికను సమర్పించిన మస్తాన్

ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మద్దిరాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత ఎనిమిదేళ్లుగా ఆరా ఫౌండేషన్ చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం ప్రగతి నివేదన సభ ఘనంగా జరిగింది. పాఠశాల అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలను ఆరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మస్తాన్ సభలో నివేదించారు. సొంత గ్రామానికి సేవ చేయడం ఎంతో ఆనందాన్నిస్తుందని ఆయన చెప్పారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి చదువు మాత్రమే గీటురాయి అని భావించి, స్కూలును అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. మద్దిరాలలోని ప్రాథమిక పాఠశాల దినదిన అభివృద్ధి చెందిందని మస్తాన్ తెలిపారు. సొంత డబ్బును ఖర్చు చేసి స్థలం కొని భవనాన్ని నిర్మించి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా విద్యను అభ్యసించే లాగా చేశారని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మస్తాన్‌ను కొనియాడారు. ఇలాంటి వారు మన సమాజంలో అరుదుగా ఉంటారని సాటివారికి ఉపయోగపడాలనే తపన కొందరిలోనే ఉంటుందని అలాంటివారిలో మస్తాన్ ఒకరని నేతలు అభినందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ మస్తాన్ చిన్నతనం నుండి తపన గల వ్యక్తి అని ఏదో సాధించాలని పట్టుదలతో కింది స్థాయి నుండి పైకి ఎదిగిన వ్యక్తి అని అన్నారు. తన లాగానే గ్రామంలో ఉన్న పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని భావించే వ్యక్తి మస్తాన్ అని పేర్కొన్నారు. పుట్టి పెరిగిన గ్రామంలో స్కూలును అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్న పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థితిలోకి ఎదుగుతారని ప్రభుత్వం కేటాయించిన ఉపాధ్యాయులే కాకుండా సొంతగా ఎనిమిది మందిని నియమించి పిల్లల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారన్నారు.

చిన్న వయసులో ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారని మస్తాన్ ను అభినందించారు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామ రెడ్డి. ఆరా ఫౌండేషన్ ద్వారా మద్దిరాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంతో అభివృద్ధిపరిచారని మస్తాన్ చేసే ఆలోచన విధానం, చేసే పని సమాజానికి పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

నేటి రోజుల్లో పై చదువులు చదివితేనే ఉన్నత స్థాయిలో ఉంటారని గుర్తించిన మస్తాన్ తాను స్థాపించిన ఆరా ఫౌండేషన్ ద్వారా సొంత గ్రామంలో స్కూలును అభివృద్ధి పరిచారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు అన్నారు. మద్దిరాలలోని స్కూలును పీఎం శ్రీ స్కూల్ గా మార్చేందుకు తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఆ అనుమతి లభిస్తే కేంద్రీయ విశ్వవిద్యాలయం కన్నా ఎక్కువ సౌకర్యాలు అంతకన్నా మెరుగైన చదువు లభిస్తుందని పేర్కొన్నారు. స్కూలు అభివృద్ధి కోసం నూతనంగా నిర్మించే భవనానికి ఎంపీ నిధుల నుంచి 15 లక్షలు అందిస్తానని ఎంపీ ప్రకటించారు.