International

ఆత్మహత్య చేసుకున్న అమెరికా బిలియనీర్

సమాజంలో సాధారణంగా డబ్బున్నవాళ్లు చాలా హాయిగా,సుఖంగా జీవిస్తారని అంటుంటారు. అంతేకాకుండా వాళ్లకి జీవితంలో  కష్టాలే ఉండవని అభిప్రాయపడుతుంటారు. ఇవన్నీ ఉట్టి మాటలే అని ఈ తాజా ఘటన స్పష్టం చేస్తుంది. థామస్ లీ(78) అనే వ్యక్తి అమెరికాలో ప్రముఖ ఇన్వెస్టర్,ఫైనాన్షియర్. కాగా ఆయన 1974లో థామస్ లీ పార్టనర్స్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత 2006లో లీ ఈక్విటినీ ప్రారంభించారు. అంతేకాకుండా గత 5 దశాబ్దాలుగా వందలాది సంస్థల్లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఈ విధంగా ఆయన ఓ వ్యాపారవేత్తగాను అంతేకాకుండా ఓ దాతగాను ఎదిగారు.

అలాంటి అమెరికా బిలియనీర్ థామస్ లీ ఆత్మహత్య చేసుకోవడం సంపన్న, వ్యాపార వర్గాలను కలవరానికి గురిచేస్తుంది. కాగా ఆయన తన ఆఫీసులోనే తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియాల్సివుంది. అమెరికా కాలమానం ప్రకారం..థామస్ లీ గురువారం ఉదయం తన ఆఫీసుకి వచ్చారు. అయితే ఆయన ఎంతసేపటికి తన గది నుంచి బయటకు రాలేదు. ఆయన వ్యక్తిగత సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా ఆయన బాత్రూమ్‌లో రక్తపు మడుగులో కన్పించారు. అది చూసి భయపడిన ఆమె వెంటనే 119కు కాల్ చేసింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే ఆయన మరణించారు. కాగా ఆయన తలకు బుల్లెట్ గాయమయినట్లు తెలుస్తోంది. అయితే లీ తనను తాను కాల్చుకొని ఉంటారని అక్కడి పోలీసులు నిర్ధారించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. థామస్ లీ కుటుంబ సభ్యులు సహితం ఆయన మరణంపై ఓ ప్రకటనను విడుదల చేసినప్పటికీ ఆత్మహత్యకు కారణాలను అందులో వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచంలోని వ్యాపారవేత్తల్లో గుబులు పుట్టిస్తుంది.