కాసేపట్లో ఢిల్లీ మేయర్ ఎన్నిక
సుప్రీంకోర్టులో ఆప్ విజయం తర్వాత ఢిల్లీ మున్సిపాల్టీ మేయర్ ఓటింగ్ ప్రారంభమైంది. డిసెంబరులో ఎన్నికలు జరిగినప్పటి నుండి, ఆప్, బీజేపీ మధ్య సుదీర్ఘ పోరు నడుమ ఢిల్లీ మేయర్ ఎన్నికలు మూడుసార్లు వాయిదా పడింది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులను ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించడాన్ని ప్రశ్నిస్తూ ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నామినేటెడ్ సభ్యులు ఎన్నికల్లో ఓటు వేయరాదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. నామినేటెడ్ సభ్యులకు ఎన్నికతో సంబంధం లేదంది. ఇందుకు రాజ్యాంగ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. మేయర్ ఎన్నిక అనంతరం డిప్యూటీ మేయర్‌తోపాటు ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను అదే రోజు ఎన్నుకుంటారు. స్టాండింగ్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో ఆప్‌కి మూడు, బీజేపీకి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆరో సీటుపై పోరు తప్పేలా లేదు. నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసేందుకు అనుమతిస్తే, బీజేపీ బలం 113 నుంచి 123కి చేరి ఉండేది. 274 మంది సభ్యుల సభలో ఆప్‌కు 150 ఓట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్ 138.

ఇది మేయర్ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయకపోయినా, అత్యంత శక్తివంతమైన సంస్థగా భావించే స్టాండింగ్ కమిటీలో బీజేపీ కీలకమైన భాగాన్ని కైవసం చేసుకోగలిగింది. AAP కౌన్సిలర్ల నుండి “బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు” ఆరోపణలను విన్పిస్తున్న తరుణంలో తాము ఓటింగ్‌కు దూరంగా ఉంటామని కాంగ్రెస్ చెప్పింది. మేయర్ కోసం ఎలక్టోరల్ కాలేజీలో 250 మంది ఎన్నికైన కౌన్సిలర్లు, ఏడుగురు లోక్‌సభ, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ 13 మంది ఆప్ ఎమ్మెల్యేలను, ఒక బీజేపీ సభ్యుడిని ఎంసీడీకి నామినేట్ చేశారు. గత సంవత్సరం MCD విలీనం, నియోజకవర్గాల రీడ్రాయింగ్ తర్వాత జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికల్లో 250 వార్డులలో 134 వార్డులను AAP గెలుచుకుంది. 15 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపాల్టీని నియంత్రించిన బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 10 మంది నామినేటెడ్ సభ్యులను నియమించడంపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నామినేట్ చేయబడిన 10 మంది సభ్యులు ప్రమాణం చేయడం, వారి ఓటింగ్ వేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో మూడుసార్లు మేయర్ ఎన్నిక నిలిచిపోయింది. సుప్రీంకోర్టు విచారణకు అనుగుణంగా ఎన్నికలను నాలుగోసారి వాయిదా వేశారు.

