అదానీ విషయంలో దాచిపెట్టడం లేదు… భయపడటం లేదు..!
హిండెన్‌బర్గ్-అదానీ వివాదం రోజు రోజుకు ఉధృతమవుతోంది. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రోనీ క్యాపిటలిజం ఆరోపణలతో రాజకీయ దుమారం రేగుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాలు డిమాండ్ చేయడంతోపాటు.. ప్రధాని మోదీ బదులివ్వాలంటూ… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడుల విషయంలో ఏం చేస్తారో చెప్పాలని విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. PSUలు, నియంత్రణ సంస్థలు తమ నిబంధనలను అనుసరించి పనిచేస్తున్నామంటూ బదులివ్వడంతో… ప్రభుత్వం విపక్షాల ఆరోపణలను ఖండించింది. హిండెన్‌బర్గ్-అదానీ వివాదంపై ప్రతిపక్షాలు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లినందున తాను వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మొత్తం వ్యవహారంలో బీజేపీ దాక్కోవాలనుకోవడం లేదని భయపడాలనుకోవడం లేదన్నారు.

ఇక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై హోం మంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. మొత్తం వ్యవహారం పూర్తిగా అదానీ గ్రూపుకు సంబంధించినది, రాహుల్ గాంధీ ఏ ప్రసంగం ఇవ్వాలనుకుంటున్నాడో కాంగ్రెస్ నాయకుడు లేదా అతని స్క్రిప్ట్ రైటర్లు నిర్ణయించుకోవాలని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఎలాంటి ప్రసంగం చేయాలనుకుంటున్నాడో ఆలోచించాలన్నారు. బీజేపీపై రాహుల్ గాంధీ చేస్తున్న ‘క్రోనీ క్యాపిటలిజం’ ఆరోపణలపై షా స్పందించారు.
అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ఇప్పటి వరకు బీజేపీపై ఎవరూ అలాంటి ఆరోపణ చేయలేకపోయారని… కాంగ్రెస్ హయాంలో కాగ్, సీబీఐ 12 లక్షల కోట్ల రూపాయల అవినీతిని గుర్తించి కేసులు నమోదు చేశాయన్నారు అమిత్ షా.

విచారణ సంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయన్న ఆరోపణలకు స్పందించిన అమిత్ షా… కోర్టులు బీజేపీ ఆధీనంలో లేవని.. అక్కడకు వెళ్లాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. అల్లరి చేయడం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి తెలుసునని… పెగాసస్ విషయంలో కూడా తీర్పు వచ్చిందన్నారు. అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ నివేదిక, BBC డాక్యుమెంటరీ నేపథ్యంలో కుట్ర ఉందా అని ప్రశ్నించగా అందుకు సూటిగా సమాధానం చెప్పారు షా. వేల కుట్రలు సత్యానికి హాని కలిగించలేవని… సత్యం సూర్యుడిలా ప్రకాశిస్తుందని… 2002 నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని… ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతిసారీ, మోదీ బలంగా, నిజాయితీగా వ్యవహరించి మరింత ప్రజాదరణ పొందారన్నారు.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదికను అనుసరించి పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేసేందుకు సెబీ అంగీకరించిందని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి సెబీ పూర్తిగా సన్నద్ధమైందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి తెలియజేశారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులకు రక్షణ ఎలా ఉంటుందో సూచించడానికి కమిటీని నియమించడంలో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని మెహతా చెప్పారు. అయితే, కమిటీ అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుంది కాబట్టి, ప్రభుత్వం సీల్డ్ కవర్లో పేర్లను అందజేస్తుందని ఆయన చెప్పారు.

