కేసీఆర్ సిద్ధంగా ఉండు… మోదీ వస్తున్నాడు…
తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయ్. వచ్చే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశాల్లో బీజేపీ వ్యూహరచన చేయనుంది. అన్నీ రాష్ట్రాలు ఒక ఎత్తైతే… తెలంగాణ మరో ఎత్తు అన్నట్టుగా బీజేపీ పెద్దలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పార్టీ కీలక నేత అమిత్ షా ఇందుకు సంబంధించి అనేక ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్ర నాయకత్వం నుంచి అందిన సమాచారంతోపాటు, వ్యక్తిగతంగానూ నేతలు తెలంగాణ రోడ్ మ్యాప్ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యవర్గసమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యనేతలంతా హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నానికి ప్రధాని నరేంద్రమోదీతో సహా బీజేపీ అతిరథ మహారథులందరూ భాగ్యనగరానికి చేరుకుంటారు. ఈ సమావేశాల్లో జాతీయ స్థాయి అంశాలపై దృష్టి సారించడమే కాకుండా… ప్రత్యేకంగా తెలంగాణ విషయంలో ఎలాంటి అడుగులు వేయాలన్నదానిపై పార్టీ సమాలోచనలు చేయనుంది. రాష్ట్రంలో పార్టీ కీలక నేతలతో ప్రధాని మోదీ, అమిత్ షా వన్ టు వన్ మాట్లాడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ సైతం పార్టీ నేతలు రూపొందించారు. కేసీఆర్ పాలనలో సాగుతున్న అరాచకాలు, అకృత్యాలు, దోపిడి రాజ్, కుటుంబ పాలన, అవినీతిపై కార్యవర్గసమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర నేతలు ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.