ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి గైర్హాజరుపై వివరణ..
ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరుకాలేదు. విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ రోహిత్ రెడ్డి విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో ఈడీ విచారణకు గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. విచారణకు హాజరయ్యే విషయంలో ఈడీకి తాను ఎలాంటి మెయిల్ పంపలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసులో మనీలాండరింగ్ జరగలేదని, అయినా ఈడీ జోక్యం చేసుకోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, రేపు అది బెంచ్‌పైకి వస్తుందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తానని అన్నారు. ఈడీ విచారణకు వెళ్లడంపై న్యాయవాదులతో చర్చించి వారు చెప్పినట్లు చేస్తానన్నారు. ఇప్పటికే రెండుసార్లు రోహిత్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. డిసెంబర్ 27న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో మరోసారి హాజరుకావాలని రోహిత్‌ను ఆదేశించింది ఈడీ. అయితే విచారణకు రాలేనని రోహిత్ రెడ్డి ఈడీకి ఈ మెయిల్ పంపినట్లు వార్తలు వచ్చినా వాటిని రోహిత్ రెడ్డి ఖండించారు.

