ఏపీలో మొదలైన ఎన్నికల సందడి.. అధినేతల జిల్లా టూర్లు
◆ పార్టీ అధినేతల జిల్లాల పర్యటనలు
◆ గడప గడపతో అధికారపక్షం
◆ ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ టీడీపీ
◆ ప్రజల్లో పట్టు సాధించేందుకు పార్టీల వ్యూహాలు
ఏపీలో సాధారణ ఎన్నికలు జరగటానికి మరొక 16 నెలలు మాత్రమే గడువు ఉండటంతో ఎన్నికల వేడి పెరుగుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రజల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు జిల్లాల పర్యటనలను విస్తృతం చేస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత మూడు రోజులు పాటు కడప జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అలానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచార నేపద్యంలో ఆయా రాజకీయ పక్షాలు దూకుడు పెంచాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు రెండు సంవత్సరాల ముందు నుండే పావులు కదుపుతున్నాయి. ప్రజల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పక్షాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. నవరత్నాల అమలులో అధికార పార్టీ దూకుడుగా వెళ్తుంటే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాటతో టీడీపీ ప్రజల్లో బలాన్ని పెంచుకునే దిశగా ముందుకు సాగుతుంది. ఇక బీజేపీ,జనసేనలు మిత్రపక్షాలుగా ముందుకు సాగాలని వేస్తున్న అడుగులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనుక్కన్నట్టుగా సీన్ కన్పిస్తోంది.

వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునేందుకు ప్రజా సమస్యలపై ఉద్యమం బాట పట్టాయి. ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీలు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాయి. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నూరు శాతం అమలు చేయాలని లక్ష్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న కూడా పథకాలకు బ్రేక్ పడకుండా పేద వర్గాలకు అందిస్తూ వారి హృదయాలలో స్థానం సంపాదించాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. బీసీలలో ఉన్న కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌లో ఏర్పాటు చేయటంతో పాటు ఆ వర్గాలకు చెందిన నేతలకు చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారు. దీంతో వెనుకబడిన వర్గాలలో ఆ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికార పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తున్న ప్రజల్లో ఆ మేరకు సంతృప్తి శాతం పెరగటం లేదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో పలువురు వైసీపీ నాయకుల వ్యవహార శైలి పట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

పెరిగిన నిత్యవసర వస్తువుల ధరల ప్రభావం కూడా ప్రభుత్వంపై పడుతుంది. మధ్య తరగతి ప్రజల్లో వైసీపీ పట్ల కొంతమేర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వారిని విస్మరించి భజన బృందాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదనలు ఆ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా నవరత్నాల గురించి ప్రజలకు వివరించేందుకు వైసీపీ గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాబోవు ఎన్నికల నాటికి తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టింది. అధికార వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలం చేసుకునేందుకు టీడీపీ ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంది. వివిధ ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల లో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలతో మమేకమయ్యేందుకు ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించిన ఆ పార్టీ ప్రస్తుతం ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ వినూత్న కార్యక్రమంతో ముందుకు కదులుతుంది.

ఇక జనసేన పార్టీ ప్రజా సమస్యలపై పోరుబాట పట్టి ప్రజల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. అధ్వానంగా ఉన్న రహదారులపై ఇప్పటికే పలు ఆందోళన లు చేపట్టిన పార్టీ, మత్స్యకారులు రైతులు సమస్యలపై గళం విప్పుతోంది. కానీ బీజేపీతో జనసేన మిత్రపక్షంగా ఉండటంతో బలపడవచ్చని రెండు పార్టీలు భావించిన బీజేపీ వివిధ అంశాల పట్ల దాగుడుమూతల రాజకీయాలు చేస్తోండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. బీజేపీనా, టీడీపీనా అన్న మీమాంశ జనసేన కేడర్లో ఉంది. ఈ ప్రభావం జనసేనపై పడుతోందని కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. వామపక్ష పార్టీలు పరిమిత బలంతో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉనికిని కాపాడుకుంటున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వివిధ ప్రజా సమస్యలపై ఉద్యమం బాటలో నడుస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన పూర్వ వైభవం సాధించే దిశగా వేస్తున్న అడుగులు ఏపీలో ముందుకు పడటం లేదు.

