అప్పుల ఊబిలో ఆంధ్ర.. బాగు చేయడం బాబుకే సాధ్యం.. : డిఎల్ రవీంద్రారెడ్డి
ఏపీలో తన స్నేహితుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం బాగుపడుతుందని భావించానని కానీ ఇంత అవినీతికి జగన్ పాల్పడతారని నా జీవితంలో అనుకోలేదని మాజీ మంత్రి వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆయన అంత అవినీతిపరుడు అయినందుకు సిగ్గుపడుతున్నానని తెలిపారు. బుధవారం కడప ప్రెస్ క్లబ్ లో రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి బాగు చేయాలంటే ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అడిగిన వారికి, అడగని వారికి జగన్ ప్రభుత్వం పప్పు బెల్లాలు పంచి పెడుతున్నట్లుగా డబ్బులను విచ్చలవిడిగా పంచుతుందని దీంతో ఖజానా ఖాళీ అయిందని అన్నారు. అప్పులతో కాలం వెళ్లదీసే పరిస్థితులు దాపరించాయని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం గాడి తప్పిన నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చంద్రబాబు తిరిగి పుంజుకునేలా చేశారని గుర్తు చేశారు. జనవరి 3 తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ ఊహించని మలుపు తిరుగుతుందని ,అందులో పెద్దలు ఎవరు ఉన్నారు చేతులు మారిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో బయటకు రానున్నట్లు తెలిపారు. తాను ఇంకా వైసీపీలోనే ఉన్నానని రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఆది వైసీపీ తరఫున గాని ఇతర పార్టీల తరఫున గాని ఉండొచ్చని చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దిగజారిపోయిన రాష్ట్ర పరిస్థితిని వారిద్దరూ కలిసి పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాని తెలిపారు.