InternationalNews

అధ్యక్షుడు దిగిపోవాలంటూ చైనాలో ఆందోళనలు

చైనా ప్రజల తిరుగుబావుటా
ప్రభుత్వం దిగిరాకుంటే వెనక్కి తగ్గం
చైనా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసనలు
కమ్యూనిస్టు పార్టీపై పెల్లుబీకుతున్న ఆగ్రహం
జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేయాలంటూ ఆందోళనలు 
కరోనా లాక్ డౌన్‌లపై విరుచుకుపడుతున్న జనం

 

ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగాలని భావిస్తున్న చైనా అందు కోసం తాను ప్రపంచంలో మిగతా దేశాల కంటే గొప్పదానిని అనిపించుకోవాలన్న దుగ్ధ ఇటీవల కాలంలో ఎక్కువైంది. ప్రపంచానికి కరోనా మహమ్మారిని అంటించి.. చలి కాచుకున్న చైనా.. ఇప్పుడు అదే కరోనాతో విలవిలలాడుతోంది. వాస్తవానికి చైనాలో కరోనా కేసులు ఎక్కువ లేకున్నా ప్రభుత్వం చేస్తున్న అతి ఇప్పుడు సామాన్యులు తిరగబడేలా చేస్తోంది. కరోనా పేరుతో సుదీర్ఘంగా లాక్ డౌన్‌లు విధించడం వల్ల తినేందుకు తిండిలేక, చావాల్సి వస్తోందంటూ ఆందోళనకారులు నిరనసలు ఉధృతం చేస్తున్నారు. చైనాలో కరోనా లాక్ డౌన్‌లో ఎత్తేయాలంటూ నినదిస్తున్నారు. అధ్యక్షుడు జీజిన్పింగ్, కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. తమ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

చైనా ప్రభుత్వ జీరో-కోవిడ్ విధానంపై నిరాశతో నిరసనలు మిన్నంటుతున్నాయి. నాలుగైదు కేసులు వచ్చాయన్న కారణంగా పోలీసులు, అధికారులు లాక్‌డౌన్ విధించడంపై సామాన్యులు భగ్గుమంటున్నారు. కరోనా పేరుతో జీవితాలను ఆగమాగం చేస్తున్నారని మండిపడుతున్నారు. రోజుల తరబడి బయటకు రాకుండా చేయడం, పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. వాయువ్య చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతం రాజధాని ఉరుమ్‌కిలో జరిగిన ఘోరమైన అగ్నిప్రమాదం ప్రజల కోపాన్ని మరింతగా పెంచేసింది. కోవిడ్ లాక్‌డౌన్‌లు రెస్క్యూ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయని చాలా మంది ఆందోళనకు దిగారు. కరోనా పేరుతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పుబడుతున్నారు. ఘోర అగ్నిప్రమాదం తర్వాత వందలాది మంది ప్రజలు ఉరుంకీ ప్రభుత్వ కార్యాలయాల బయట లాక్‌డౌన్‌ ఎత్తేయాలంటూ నినాదాలు చేశారు.

ఆదివారం రాత్రి, రాజధాని బీజింగ్‌లోని ఒక నది ఒడ్డున కనీసం 400 మంది ప్రజలు చాలా గంటలపాటు గుమిగూడారు. మేమంతా జిన్‌జియాంగ్ ప్రజలం! చైనా పేరు చెప్పుకునేవారు వెళ్లిపోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలోని అతిపెద్ద మహానగరమైన షాంఘై డౌన్‌టౌన్‌లో, అధికారులు ప్రజలను ఆ ప్రదేశం నుండి తరలించడానికి ప్రయత్నించడంతో పోలీసులు నిరసనకారుల సమూహాలతో ఘర్షణ పడ్డారు. వారిలో కొందరు “జి జిన్‌పింగ్, దిగిపో! సిసిపి, దిగిపో!” అని నినాదాలు చేయడం చేయడం కన్పించింది. కోవిడ్ -19 మొదట ఉద్భవించిన సెంట్రల్ సిటీ అయిన వుహాన్‌లో ఆదివారం కూడా నిరసనలు జరిగాయి. గ్వాంగ్‌జౌ, చెంగ్డూ , హాంకాంగ్‌లలో ప్రదర్శనల హోరెత్తుతున్నాయి.

లాక్‌డౌన్‌లకు వ్యతిరేకంగా బీజింగ్‌లోని ఎలైట్ సింఘువా విశ్వవిద్యాలయంలో 200 నుండి 300 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జియాన్, గ్వాంగ్‌జౌ, వుహాన్‌లోని క్యాంపస్‌ల నుండి నిరసనకాకరులు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఆందోళలను ఉధృతం చేశారు. లియాంగ్మా రివర్, ఉరుంకి రోడ్, బీజింగ్, షాంఘైలలో నిరసనలు కొనసాగుతున్నాయి. ట్విట్టర్‌లో ర్యాలీలకు సంబంధించిన వీడియోలను షేర్ చేయడంతో… ప్రభుత్వం వాటిని బ్లాక్ చేసింది. షాంఘైలో నిరసనలను కవర్ చేస్తున్నప్పుడు చైనాలోని జర్నలిస్టులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేసి, చేతికి సంకెళ్లు వేసి చితక్కొట్టినట్టు BBC ఆదివారం తెలిపింది. చైనాలో సోమవారం 40,052 దేశీయ కోవిడ్ -19 కేసులను నమోదయ్యాయి. గతంలో కరోనా కేసులతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.