డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ స్వామినాథన్ రాజీనామా..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ పదవికి రాజీనామా చేయాలని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ నిర్ణయించారు. డబ్ల్యూహెచ్‌వోలో ఐదేళ్ల పాటు పనిచేసిన 63 ఏళ్ల సౌమ్య రిటైర్మెంట్కు రెండేళ్ల ముందే రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30వ తేదీన రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత భారత్‌కు వచ్చి కొన్ని ఆచరణీయ కార్యక్రమాలపై విస్తృతంగా పని చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో చేపట్టే వివిధ ప్రణాళికలను భారత్‌లో ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికను రూపొందిస్తానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది కీలక వ్యక్తులతో తన అభిప్రాయాలను, ఆలోచనలను, భావాలను డబ్ల్యూహెచ్‌వో ద్వారా ముందుకు తీసుకెళ్లగలిగానని సౌమ్య ఆనందం వ్యక్తం చేశారు.

భారత్‌లో పెట్టుబడులకు సౌమ్య ఆసక్తి..
భారత్‌లో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలను శక్తివంతం చేసేందుకు ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. క్షయ, హెచ్ఐవీల్లో పరిశోధనలతో సౌమ్య ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. విదేశాల్లో ఏ అవకాశం వచ్చినా కొద్ది కాలమే పని చేస్తానని చెప్పారు. 2017లో డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా చేరిన సౌమ్య.. సైన్స్ డివిజన్ ఏర్పాటు తర్వాత తొలి చీఫ్ సైంటిస్ట్‌గా నియమితులయ్యారు. డబ్ల్యూహెచ్‌వోకు ముందు ఆమె ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌గా రెండేళ్ల పాటు పని చేశారు. కరోనా మహమ్మారి సమయంలో సౌమ్య చొరవతో డబ్ల్యూహెచ్‌వో సైన్స్ డివిజన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

