సరికొత్త జెల్‌తో మెదడు కాన్సర్‌కు చెక్
గ్లయోబ్లాస్టోమా.. ఇదేదో వింతరోగం అనుకుంటున్నారా.. కాదు మన శరీరంలో అతి ముఖ్య భాగమైన మెదడుకు వచ్చే కేన్సర్ కణితి అది. చాలా ప్రమాదకరమైనది. ఆపరేషన్ చేసి తొలగించినా కొద్ది నెలల్లోనే మళ్లీ ఏర్పడే వ్యాధి. దీని బారిన పడినవారు బతికి బట్టకట్టడం కష్టమే. ఈ వ్యాధి ఏర్పడిన వారిలో 25శాతం మంది ఏడాది బతికితే గొప్పే. ఐదేళ్ల వరకూ జీవించేవారు కేవలం 5 శాతం మంది మాత్రమే. మృత్యువాత పడుతున్న వారి సంఖ్యే అధికం. గ్లయోమా మూలకణాలను సమూలంగా తొలగించలేక పోవడం పెద్ద సవాలుగా మారింది. ఈ కణాల పని తీరు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చుట్టుప్రక్కల కణజాలాలలోకి చాలా తేలికగా చొచ్చుకుపోతుంటాయి. శస్త్రచికిత్స సమయంలో వీటిని గుర్తించడం కూడా కష్ట సాధ్యమే. కణితికి , మామూలు కణజాలం మధ్యగల తేడాను గుర్తించడం పెద్ద సవాలుగా మారుతోంది. మెదడులోని అన్ని కణాలు చాలా ముఖ్యమైనవే కావడం వల్ల వాటిని ఎక్కువగా తొలగించలేరు. దానితో ఈ కణుతులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి.
దీనికోసం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధకులు హైడ్రోజెల్‌ను రూపొందించారు. దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినట్లయితే ఇది జిగురులా నెమ్మదిగా మందును విడుదల చేస్తూ మెదడు అంతటా పరుచుకుంటుంది. ఈ మందు క్యాన్సర్ కణాలను చంపే రోగనిరోధక శక్తిని ఉత్తేజ పరుస్తుంది. ఈ శక్తి గ్లయోమా కణాలతో పోరాడి క్యాన్సర్ తిరగబెట్టడాన్ని నివారిస్తుంది. దీనివల్ల రోగి జీవితకాలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ జెల్ త్వరలో అందరికీ అందుబాటులో రావాలని ఆశిద్దాం..