NationalNews

1400 పసిపిల్లలకు తల్లిపాలు దానం

తమిళనాడులో నివసించే ఓ మహిళ చనుబాలను దానం చేసి రికార్డుల్లోకెక్కింది. కేవలం 10 నెలల వ్యవధిలో 55 లీటర్లు చనుబాలను సమీకరించి, ఆపై డొనేట్‌ చేసి రోల్‌ మోడల్‌గా నిలిచింది. చేసిన గొప్ప పని కారణంగా ఆమె పేరు `ఆసియా అండ్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ లోకి ఎక్కింది.

అసలు ఆమె ఎవరు అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్దాం. కోయంబత్తూరు జిల్లా కన్యూర్‌ ప్రాంతంలో నివసించే 29 ఏళ్ల సింధు మోనికకు ప్రొఫెసర్‌ మహేశ్వర్‌తో 6 సంవత్సరాల క్రితం మ్యారేజ్‌ అయ్యింది. ఈ దంపతులకు వెంబా అనే ఏడాదిన్నర పాప ఉంది. చనుబాలు డొనేట్‌ చేయడం గురించి సోషల్‌ మీడియా ద్వారా సింధు మోనిక అవగాహన పెంచుకుంది. తాను కూడా చనుబాలను డొనేట్‌ చేయాలని నిర్ణయానికి వచ్చింది.

ఈ క్రమంలో తల్లి పాల నిల్వ కోసం విశేషంగా కృషి చేస్తున్న `అమృతం థాయ్‌ పల్‌ దానం’ అనే సంస్థను సంప్రదించింది. మోనిక తిరుపూర్‌ జిల్లా అవినాసి ఏరియాలో ఉన్న కార్యాలయానికి వెళ్ళి .. తల్లి పాలను ఎలా సేకరించాలి? ఎలా స్టోర్‌ చేయాలి?… పాడవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పలు విషయాలపై అవగాహన పెంచుకుంది. ఈ పద్ధతులను పాటిస్తూ సింధు మోనిక గత 10 నెలల్లో 55 లీటర్ల చనుపాలను సేకరించి కోయంబత్తూరు గవర్నమెంట్‌ ఆస్పత్రికి అందించారు. ఆమె చేసిన ఈ గొప్ప పనికి `ఆసియా అండ్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ లో చోటు సంపాదించుకుంది. గతేడాది `అమృతం థాయ్‌ పల్‌ దానం’ అనే సంస్థ నుంచి 1,143 లీటర్ల రొమ్ము పాలను సేకరించగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 1,500 లీటర్లు సేకరించి దానం చేసినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.