సుప్రీంలో 37 ఏళ్ల ప్రయాణం మరుపురానిది:జస్టిస్ యు.యు.లలిత్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీమ్ లో తన 37 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. న్యాయవాదిగా న్యాయమూర్తిగా వృత్తిలో తన పని తీరును ఆస్వాదించినట్లు చెప్పారు. పదవి విరమణ రోజు జస్టిస్ చంద్ర చూడ్, జస్టిస్ బేల త్రివేదిలతో కలిసి చివరిసారిగా సుప్రీం ధర్మాసనంపై కూర్చొని మాట్లాడారు. 16వ ప్రధాన న్యాయమూర్తి యశ్వంత్ విష్ణు చంద్ర చూడ్ ఎదుట హాజరై ఉన్నత న్యాయస్థానంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సందర్భాన్ని లలిత్ గుర్తు చేసుకున్నారు. అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ కు తదుపరి సీజేఐగా వారసత్వాన్ని అందించడం గొప్ప అనుభూతి అని అన్నారు. తన ప్రయాణంలో రెండు రాజ్యాంగ బెంచ్ లు ఏకకాలంలో కూర్చోవటం ఎప్పుడు చూడలేదని కానీ నా హయాంలో ఒక నిర్దిష్ట రోజున మూడు రాజ్యాంగ ధర్మాసనాలు ఒకేసారి కేసులను విచారించాయని ఇది మరపురాని సంతృప్తికరమైన అనుభూతి అని లలిత్ వ్యాఖ్యానించారు. ఏడాది పొడవున ఒకే రాజ్యాంగ ధర్మాసనం పనిచేసేలా ప్రయత్నిస్తానని గతంలో లలిత్ హామి ఇచ్చారు. రాజ్యాంగ ధర్మాసనంలో భాగం కావడానికి ప్రతి జడ్జికి సమాన అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు. సిజేఐగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు తాను చేసిన వాగ్దానాలు చాలావరకు నెరవేర్చగలిగానని ఆయన అన్నారు.

