Andhra PradeshNews

ఏపీకి తప్పిన సిత్రాంగ్ ముప్పు

ఏపీకి తుపాను ముప్పు దాదాపు లేనట్టే అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర ఒడిశా , పశ్చిమ బెంగాల్ వైపు కదిలే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 22వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడి తర్వాత 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు సూచించారు. మొదటిగా ఇది ఏపీ, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావించారు. కానీ ఏపీ, ఒడిశా తీరం వైపు వచ్చినా మధ్యలో దిశ మార్చుకుని ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ వైపు కదులుతుందని తాజాగా అంచనా వేసినట్టు తెలిపారు. ఏపీలో గత 15 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా సముద్ర తీరంలోని ఉష్ణోగ్రతలు బాగా తగ్గగా అదే సమయంలో పశ్చిమ బెంగాల్ తీరంలోని ఉష్ణోగ్రతలు ఇక్కడి కంటే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తుపాను పశ్చిమ బెంగాల్ వైపు కదిలేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని, వాతావరణంలో అనుహ్య మార్పులు జరిగితే తప్ప ఏపీకి తుపాను ప్రభావం ఉండదని వాతావరణ శాఖ చెబుతోంది.