రండి బాబు రండి.. మా పార్టీలో చేరండి..
ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్న ప్రధాన పార్టీలు
బీజేపీ నేతకు కేటీఆర్ ఫోన్.. సోషల్ మీడియాలో వైరల్
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
మునుగోడు, మనసర్కార్: మునుగోడు ఉప ఎన్నికతో గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు అన్ని స్థాయిల రాజకీయ నాయకులకు గిరాకీ పెరిగింది. వీళ్లకు ప్రధాన పార్టీలు.. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ ఎర్ర తివాచీ వేసి మరీ స్వాగతం పలుకుతున్నాయి. ‘రండి బాబు రండి.. మంచి అవకాశం.. మించిన దొరకదు.. మా పార్టీలో చేరండి’ అంటూ వేడుకుంటున్నాయి. ఆయా పార్టీల పెద్ద నాయకులు ఫోన్లు చేస్తున్నారు.. ఇంటికెళ్లి మరీ బుజ్జగిస్తున్నారు. ఇదే అదనుగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రాజకీయ నాయకులు తమ స్థాయికి తగ్గట్లు బేరాలు కుదుర్చుకొని మరీ గోడ దూకుతున్నారు. మరో విశేషం ఏమిటంటే.. సొంత పార్టీ నాయకులను కాపాడుకునేందుకూ ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే నాయకుల డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

బీజేపీ నేత జగన్నాథంను ఏకంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి మరీ టీఆర్ఎస్లోకి రావాలని కోరారు. ‘గట్టుప్పల్ మండలంలో మీకు మంచి పలుకుబడి ఉందని తెలిసింది. మీరు మా పార్టీకి కొంచెం సహకరించండి. గట్టుప్పల్‌ను అభివృద్ధి చేసుకుందాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి బీజేపీ మనిషి కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా కాదు. అవకాశవాద రాజకీయం కోసమే బీజేపీలో చేరారు. తన కాంట్రాక్టులే చూసుకున్న రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదు. ఈ ఎన్నికల తర్వాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక్కడి ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ అందేట్లు చూద్దాం’ అని జగన్నాథంను కాకా పట్టే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఈ ఫోన్ సంభాషణకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గట్టుప్పల్ మండలానికి కేటీఆర్ ఇంచార్జిగా ఉన్నారు.

కేటీఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన జగన్నాథం.. తాను బీజేపీకి ద్రోహం చేసే ప్రసక్తే లేదని.. వందల ఎకరాలున్న భూస్వాములకు రైతుబంధు నిలిపివేసి కౌలు రైతులకు ఇవ్వాలని సూచించారు. దీంతో జగన్నాథంను గట్టుప్పల్ ప్రజలు అభినందిస్తున్నారు. బీజేపీ లీడర్లను కొనేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని, తమ నాయకులను ఎవరూ కొనలేరని బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. కాగా.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్‌లు భారీగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీలోకి, టీఆర్ఎస్లోకి వలసలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు.. టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో పాటు మరో ముగ్గురు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నేత వడ్డేపల్లి నర్సింగ్‌రావు కుమారుడు, కూకట్పల్లి నియోజక వర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు, వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమారుడు నరేశ్ ముదిరాజ్, మహబూబ్ నగర్‌కు చెందిన మరో నేత బుధవారం కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ తదితరులు హాజరు కానున్నారు.

