NewsTelangana

బీసీసీఐ అధ్యక్షుడిగా బిన్నీ.. గంగూలీ పరిస్థితి..?

ముంబై, మనసర్కార్‌: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ స్థానంలో రోజర్‌ బిన్నీ బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) చైర్మన్‌ పదవి చేపట్టాలన్న గంగూలీ ఆశలు మాత్రం నీరు గారాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి కొనసాగాలన్న కోరికా నెరవేరలేదు. ఇప్పుడు ఆయన మళ్లీ బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) అధ్యక్షుడిగా వెళ్లాలని భావిస్తున్నారు. గంగూలీ.. ఐసీసీ నుంచి క్యాబ్‌ వైపు దృష్టి మరల్చడానికి కారణమేంటి..? ఈ సమస్యను రాజకీయంగా వాడుకోవాలని మమతా బెనర్జీ ఎందుకు భావిస్తున్నారు..?  

కీలక నాయకుడి సూచనతోనే..

ప్రపంచంలోనే ధనిక క్రికెట్‌ బోర్డుగా గుర్తింపు పొందిన బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా కర్నాటకకు చెందిన రోజర్‌ బిన్నీ ఎన్నికయ్యారు. మంగళవారం నాడిక్కడ జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో 1983 ప్రపంచ కప్‌ హీరో అయిన బిన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవిలో బిన్నీ మూడేళ్ల పాటు కొనసాగుతారు. 15 రోజుల క్రితం వరకూ రేసులో లేని బిన్నీ పేరు అకస్మాత్తుగా తెరపైకి రావడం విశేషం. కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ నాయకుడి సూచన మేరకే 67 ఏళ్ల బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిని చేశారని వార్తలొచ్చాయి.

ఐసీసీకి అనురాగ్‌ ఠాకూర్‌ లేదా శ్రీనివాసన్‌..?

భారత క్రికెట్‌లో ఇంతకాలం చక్రం తిప్పిన గంగూలీ పరిస్థితి అకస్మాత్తుగా గందరగోళంగా మారింది. ఐసీసీ పగ్గాలు చేపడదామని ప్లాన్‌ చేసిన ఆయనకు బీసీసీఐ మొండిచేయి చూపింది. బీసీసీఐ సిఫారసు చేస్తేనే గంగూలీ ఐసీసీ పగ్గాలు చేపట్టగలరు. కానీ.. సిఫారసు చేసేందుకు బీసీసీఐ నిరాకరించడంతో గంగూలీ కంగుతిన్నారు. ఐసీసీ చైర్మన్‌ పదవికి పోటీ చేయాలని బీసీసీఐ నిర్ణయిస్తే క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లేదా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ రేసులో ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌ గ్రెగ్‌ బార్‌ క్లే ఆ పదవిలో రెండోసారి కొనసాగేందుకు మద్దతివ్వడంపైనా బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గంగూలీ వివాదం రాజకీయ రంగు..

బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి కొనసాగాలన్న గంగూలీ ప్లాన్‌కూ క్రికెట్‌ పెద్దలు అంగీకరించలేదని తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు రెండోసారి కూడా ఎన్నికయ్యేందుకు సుప్రీం కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఆ అవకాశాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సద్వినియోగం చేసుకున్నారు. గంగూలీకి మాత్రం మద్దతు లభించలేదు. ఇదంతా బీజేపీ రాజకీయమేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మంచి వ్యక్తి అయిన గంగూలీని ఐసీసీ చైర్మన్‌గా సిఫారసు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో గంగూలీ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.

టీఎంసీకి పెద్ద దిక్కుగా గంగూలీ..

బెంగాల్‌లో బీజేపీ దూకుడుతో అష్టకష్టాలు పడుతున్న మమతా బెనర్జీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గంగూలీ సాయంతో గట్టెక్కాలని ప్లాన్‌ చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న గంగూలీకి బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టీఎంసీ తరఫున ఎంపీగా పోటీ చేయించాలని మమత స్కెచ్‌ వేసినట్లు సమాచారం. అదే జరిగితే.. గంగూలీని తమ పార్టీ తరఫున స్టార్‌ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా తిప్పాలని.. తద్వారా ఓట్లు రాబట్టాలని మమత వ్యూహాన్ని రూపొందిస్తున్నారని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే.. గంగూలీ సమస్యను రాజకీయం చేస్తున్నట్లు చెబుతున్నాయి.