హాంకాంగ్, తైవాన్ విషయంలో రాజీపడబోమన్న చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన అధ్యక్షుడు జీజిన్పింగ్ హాంకాంగ్, తైవాన్ విషయంలో చైనాది ఒకటే వైఖరి అని స్పష్టం చేసారు. గతంలో హాంకాంగ్‌లో ఆందోళనలు ఎక్కువగా ఉండేవని.. ఇప్పుడు అవన్నీ కూడా సద్దుమణిగాయన్నారు. 2,300 మంది పార్టీ ప్రతినిధులు సమక్షంలో జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ వేర్పాటువాదం విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తామన్నారు. తైవాన్ చైనాలో శాంతియుతంగా భాగస్వామి కావాలన్నారు. తైవాన్ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత చైనా ప్రజలపై ఉందని, బలప్రయోగం చేసే హక్కును చైనా ఎప్పటికీ వదులుకోదని ఆయన అన్నారు. శాంతియుత పునరేకీకరణ కోసం కట్టుబడి ఉన్నామన్నారు.

జీరో-కోవిడ్ విధానం ప్రభావాలపై నెలల తరబడి విమర్శలను ఎదుర్కొన్న తరువాత, మహమ్మారితో వ్యవహరించేటప్పుడు చైనా ప్రజల జీవితాలకు మొదటి స్థానం ఇచ్చామన్నారు. చైనా ప్రజల భద్రత, ఆరోగ్యాన్ని అత్యధిక స్థాయిలో రక్షించామన్నారు. చైనా జనాభా క్షీణత ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందనే ఆందోళనలను ప్రస్తావిస్తూ, జననాల రేటును పెంచడానికి, జనాభా వృద్ధాప్యానికి ప్రతిస్పందనగా చురుకైన జాతీయ వ్యూహాన్ని అనుసరించడానికి చైనా ఒక విధానం ఏర్పాటు చేస్తోందన్నారు. అవినీతిపై అణిచివేత కొనసాగుతుందన్నారు.

అమెరికాతో దెబ్బతిన్న సంబంధాల గురించి ప్రస్తావించనప్పటికీ, అంతర్జాతీయ దౌత్యంలో “ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని” బీజింగ్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అన్ని రకాల ఆధిపత్యం, అధికార రాజకీయాలను గట్టిగా వ్యతిరేకిస్తామన్నారు. ఇతర దేశాల దేశీయ రాజకీయాల్లో జోక్యాన్ని వ్యతిరేకిస్తామన్నారు. చైనా ప్రపంచ స్థాయి సైనిక నిర్మాణాన్ని వేగవంతం చేస్తుందన్నారు. అధిక నాణ్యత, ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా చేసుకుంటామన్న చైనా అధ్యక్షుడు ఆధునిక సోషలిస్ట్ శక్తిని నిర్మించడానికి రాబోయే ఐదు సంవత్సరాలు కీలకమన్నారు.

