NewsTelangana

ఐటీ డీజీ బదిలీ.. బడాబాబుల కోసమేనా..?

ఆదాయపు పన్ను శాఖ విచారణ విభాగం డీజీ వసుంధర సిన్హాను బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆమె స్థానంలో ముంబైలో ఆదాయపు పన్ను విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్న సంజయ్‌ బహదూర్‌ను తీసుకొచ్చారు. సంజయ్‌ బహదూర్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారి మాత్రమే కాదు.. ఆదాయపు పన్ను విధానాల రూపకల్పనలో మంచి పట్టున్న అధికారి. ఏడాది క్రితమే బాధ్యతలు చేపట్టిన వసుంధర సిన్హాను అకస్మాత్తుగా బదిలీ ఎందుకు చేశారు..? తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబానికి బినామీలుగా ఉన్న బడా బాబుల భరతం పట్టేందుకేనా అనే అనుమానం కలుగుతోంది.

వసుంధర సిన్హా

ఐటీ అధికారులతో అమిత్‌ షా భేటీ..

సెప్టెంబరు 17న హైదరాబాద్‌ విమోచన వేడుకల్లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. నేషనల్‌ పోలీస్‌ అకాడమీని సందర్శించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులతోనూ అక్కడే భేటీ అయినట్లు తెలిసింది. అనధికారికంగా జరిగిన ఈ భేటీ తర్వాతే వసుంధర సిన్హాను బదిలీ చేశారని సమాచారం. దీన్ని బట్టి కేసీఆర్‌ కుటుంబానికి ఉచ్చు బిగించేందుకు అమిత్‌ షా పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

సంజయ్‌ బహదూర్‌

కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్‌ సంస్థలపై ఐటీ దాడులు..

ఆదాయపు పన్ను అధికారులు ఇటీవల ఫీనిక్స్‌, వాసవి రియల్‌ ఎస్టేట్‌ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇంకా సోదాలు జరపాల్సిన జాబితా ఐటీ అధికారుల చేతిలో ఉంది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను ఏర్పాటు చేస్తామన్న నెపంతో రియల్‌ ఎస్టేట్‌ దోపిడీ, ఇతర సూట్‌కేస్‌ కంపెనీలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అండతో భారీ ప్రాజెక్టులు సొంతం చేసుకున్న కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్‌ సంస్థలపైనా ఐటీ దాడులు జరుగుతాయని వార్తలొస్తున్నాయి. ఈ పనులన్నీ కొత్త ఆదాయపు పన్ను విభాగం ఐజీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకే సంజయ్‌ బహదూర్‌ను తీసుకొచ్చారని సమాచారం.