కేసీఆర్‌ను అంతమాట అంటారా? కాంగ్రెస్ నేత దూకుడు
రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రజలను పట్టించుకోకుండా ఢిల్లీలో విహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వరి మొత్తం మునిగిపోయిందని దాదాపు 20 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని తెలిపారు. ఈ పరిస్థితిని ఏరియల్ సర్వే ద్వారా సమీక్షించాల్సింది పోయి ప్రజలను గాలికి వదిలేసి కేసీఆర్ మాత్రం దర్జాగా గాల్లో ప్రయాణిస్తున్నారన్నారు. 2500 కోట్లకి పైగా ఆస్తి నష్టం , ప్రాణ నష్టం జరిగిందని తెలిసిన ఏ ఒక్కరైన నష్ట పరిహారం ఇవ్వాలని సీఎంని అడిగారా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో నెం. 2 గా ఉన్న కేటీఆర్ సినిమాలు చుస్తూ కుర్చుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల మీద కూడా జీఎస్టీ ప్రకటించిందని , దీంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయన్నారు. ఈ జీఎస్టీల కారణంగా అదానీ, అంబానీ సంపద పదింతలు పెరిగాయని… సామాన్యల బతుకులు మాత్రం మారలేదన్నారు. అదానీ, అంబాని సంపద పెరిగితే దేశ సంపద పెరిగినట్టని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. సామాన్యుని పని కోసం ఆహార పథకం, ఆహార భద్రత చట్టం కాంగ్రెస్ తీసుకొచ్చాయన్నారు. కానీ 8 ఏళ్లుగా బీజేపీ కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తోందన్నారు.
బీజేపీ హయాంలో పబ్లిక్ సెక్టార్ లు మూతబడుతున్నాయన్నారు. అంతే కాకుండా రైల్వేలు, పోర్టులు ప్రైవేటు పరం చేస్తున్నారని , దీనికి తోడు వ్యవసాయం ప్రైవేటు పరం చేస్తామని కేంద్రం సూచించిందన్నారు. సోనియా రాహుల్ గాంధీల పిలుపు మేరకు ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ తో పాటు అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ,అగ్నిపథ్ ,భారీ వర్షాల వల్ల పంట నష్టాలు పై ఈ నిరసన ఉంటుందని స్పష్టం చేశారు.