NewsTelangana

సూర్యాపేట ఎస్పీ.. ‘జయహో మంత్రి జగదీశ్‌ రెడ్డి’..!

మంత్రి జగదీశ్‌ రెడ్డిని పొగుడుతూ సూర్యాపేట జిల్లా ఎస్పీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సభలో సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌.. మంత్రి జగదీశ్‌ రెడ్డిని పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయనను నాయకుడిగా పొందడం ఎలా అదృష్టమో విద్యార్థులకు వివరించారు. అంతటితో ఆగకుండా ‘జయహో మంత్రి జగదీశ్‌ రెడ్డి గారికి’ అని నినాదాలు చేస్తూ.. సభకు హాజరైన విద్యార్థులతోనూ ‘జయహో’ నినాదాలు చేయించారు. జయహో బాహుబలి అన్నట్లు.. జయహో మంత్రి జగదీశ్‌ రెడ్డి అని అరవాలని చెప్పారు.

మంత్రి జగదీశ్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో ఎస్పీ చేసిన ఈ నినాదాల వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐపీఎస్‌ అయి వుండి.. జిల్లా ఎస్పీ హోదాలో ఉన్న వ్యక్తి ఒక రాజకీయ నాయకుడికి జై కొట్టడమేంటని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. మంత్రి జగదీశ్‌ రెడ్డిని పొగుడుతూ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు.. విద్యార్థులతో నినాదాలు చేయించడం సిగ్గుచేటు అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. గతంలో కేసీఆర్‌ కాళ్లు మొక్కిన ఐఏఎస్‌ అధికారికి ఎమ్మెల్సీ పదవి దక్కినట్లే.. మంత్రి జగదీశ్‌రెడ్డిని కీర్తించిన ఐపీఎస్‌ అధికారికి కూడా ఎమ్మెల్సీ పదవి ఖాయమని ఎద్దేవా చేశారు.