NationalNews

చంపుతామంటూ ఆజాద్‌కు తీవ్రవాదుల హెచ్చరికలు…

రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఆజాద్ క్లారిటీ
వచ్చే వారం పార్టీ ప్రకటన
రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన
ఉగ్రవాదులు ఆయుధాలు వదలాలన్న ఆజాద్
బీజేపీ తొత్తుగా ఆజాద్ మారరంటూ విమర్శలు

పార్టీ ప్రారంభానికి ముందు జమ్మూ, కశ్మీర్‌లో వరుస బహిరంగ సభలను నిర్వహించారు గులాం నబీ ఆజాద్. ఉగ్రవాదులకు ఆయుధాలు వదలి జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదం వల్ల ప్రజలకు విధ్వంసం, కష్టాలను మాత్రమే మిగులుతాయన్నారు. ఆజాద్ బీజేపీ చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రవాదులు హెచ్చరించారు. ఆజాద్ ద్రోహి అంటూ దుయ్యబట్టారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ, తరచూ ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయని, స్థానిక టెర్రర్ రిక్రూట్‌మెంట్లలో ఎక్కువ మందికి నిలయంగా ఉందని, తుపాకీ సంస్కృతి తరతరాలకు హాని కలిగిస్తోందని, కశ్మీర్ లోయలో ఎక్కువ మంది యువకులు చనిపోవడం ఇష్టం లేదంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయ్.

పాకిస్తాన్ వల్లే కశ్మీర్‌లో కల్లోలం

తుపాకీలతో పరిష్కారం సాధ్యం కాదని… ప్రజలను మరిన్ని కష్టాలవైపుకు మాత్రమే నెడతాయన్నారు. ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన రాజకీయ ప్రయత్నాలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. గత నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆజాద్… జమ్ము, కశ్మీర్ లోనూ అన్ని వర్గాలతోనూ చర్చలు జరిపి… రాజకీయంగా తనకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే వారం ఆజాద్ రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. జమ్ము, కశ్మీర్ లో ఉగ్రవాదానికి పాకిస్తాన్ కారణమని… లోయలో ఎందరో మహిళలు భర్తలను కోల్పోయి వితంతువులుగా జీవిస్తున్నారని… లక్షలాది మంది పిల్లలను అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కశ్మీర్‌లో ఒక్క మరణం కూడా సంభవించడానికి అవకాశం ఇవ్వకూడదని తాను భావిస్తున్నానన్నారు. పాకిస్తాన్ ఇళ్లు చక్కబెట్టుకోలేక… కశ్మీర్‌‍ను, ఇండియాను నరకయాతనకు గురిచేస్తోందని ఆక్రోశం వెళ్లగక్కారు. ఎన్నికల్లో గెలవడానికి మతాన్ని ఎంత మాత్రం ఉపయోగించుకోనన్నారు.

ఆర్టికల్ 370 ముగిసిన అధ్యాయం

భావోద్వేగ రాజకీయాలు, తప్పుడు నినాదాలు చేయబోనన్నారు ఆజాద్. ఓ ఉగ్రవాద సంస్థ తనను చంపేస్తానని బెదిరించిందని… అయితే శాంతి మార్గాన్ని అనుసరించడాన్ని వీడబోనన్నారు. కొత్త పార్టీ ప్రారంభం ముందు ఆజాద్‌కు ఆర్టికల్ 370 ఇబ్బందికరంగా మారుతోంది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం సాధ్యం కాదని ఆజాద్ మద్దతుదారులకు పదేపదే చెబుతున్నారు. ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్ధరించడానికి పార్లమెంటులో 2/3 మెజారిటీ అవసరమన్న ఆజాద్… సుప్రీంకోర్టు మూడేళ్లుగా ఒక్కసారి కూడా కేసును విచారించలేదన్నారు. జమ్మూ, కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, ఉద్యోగాల రక్షణ, భూమి హక్కుల పునరుద్ధరణ తన అజండాలో ముఖ్యమైన అంశాలన్నారు ఆజాద్.. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం వస్తుందని చెప్పి ఎన్నికల్లో గెలవచ్చని… 75 ఏళ్లలో సాధ్యం కానిది ఇప్పుడు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు ఆజాద్.

కశ్మీర్ ప్రజలు మూర్ఖులు కారు

స్వయంప్రతిపత్తిని వాగ్దానం చేయా అంటూ ఆయన మద్దతుదారులను ప్రశ్నించారు. కొన్నిసార్లు ఎన్నికల్లో ఇదే అంశంపై పోరాడమని… మళ్లీ అవే వాగ్దానాలు చేయాలా అని ప్రశ్నించారు. వీటి వల్ల ప్రజలకు ఎలాంటి లాభం కలగదని… హాని కలిగిస్తాయని… కొండను పగులగొట్టాలనుకునే మూర్ఖుడికి తల పగులుతుంది తప్పించి.. కొండకు ఏమీ కాదని అర్థం చేసుకోవాలన్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించలేనని ఆయన అన్నారు. ఇది మోదీ ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాల వంటిది కాదన్నారు. ఐతే ఆర్టికల్ 370పై ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయి. ప్రజల ఆశను దెబ్బతీస్తారా అంటూ ఆజాద్‌పై PDP నేత మెహబూబా ముఫ్తీ విమర్శలు గుప్పించారు.