Andhra Pradesh

టీడీపీ సభ్యుల నినాదాలు.. ఏపీ అసెంబ్లీలో గందరగోళం

మొదటి రోజే ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జాబ్‌ క్యాలెండర్, జాబ్‌లెస్ క్యాలెండర్ అంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తిరస్కరించడంతో గొడవ మొదలైంది. వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియం దగ్గర దూసుకెళ్లి టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. జాబ్‌ ఎక్కడ జగన్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని టీడీపీ నినాదాలు చేసింది. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాన్ని చేపడతామని స్పీకర్ చెప్పినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యుల ప్రశ్నలే ఉన్నాయన్నారు. ప్లకార్డులతో సభలోకి రావడం సరికాదని అన్నారు. టీడీపీ సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు.