News

ఏపీకి చంద్రబాబు, లోకేష్, పవన్, బాలకృష్ణ నాన్ లోకల్!-నిప్పులు చెరిగిన జగన్

Share with

పేదల కోసం మీ బిడ్డ క‌డుతున్నవి ఇళ్లు కాదు, ఊళ్లు : సీఎం జ‌గ‌న్
30.75 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ..
21.76 లక్షల ఇళ్ల నిర్మాణం.. నేడు 7.43 ఇళ్ల గృహప్రవేశాలు.. ఇదో రికార్డ్
పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఇళ్లు
ఏపీకి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరూ నాన్- లోకలే
సొంత పార్టీని, సొంత వర్గాన్ని, అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్మేసకున్నాడు
పేదలకు ఇళ్లు కట్టకుండా పెత్తందారుల కోసం కోర్టు కేసులతో అడ్డుకున్నారు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మించిన 7.43 లక్షల గృహప్రవేశాల్లో భాగంగా సామర్లకోట జగనన్న కాలనీలో పాల్గొని బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. “చంద్రబాబు కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉన్నారా?. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్‌ జైలులో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్‌, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్‌. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంద‌ని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకుంటారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్‌. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకేనే ఓ వ్యాపారి పవన్”- అని సీఎం జగన్ బహిరంగ సభలో విమ‌ర్శించారు.

గురువారం సామర్లకోటలో ఏర్పాటు చేసిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. అనంత‌రం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్ ప్రసంగించారు. మీ బిడ్డ క‌డుతున్నవి ఇళ్లు కాదని, ఊళ్లని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. మ‌నంద‌రి ప్రభుత్వం వ‌చ్చాక ఇళ్లు లేని 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామ‌న్నారు. రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామ‌ని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయ‌ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామ‌ని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంద‌ని తెలిపారు. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంద‌ని స‌గ‌ర్వంగా చెప్పారు. లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నామ‌ని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలు
నవరత్నాల్లోని ఏ పథకం తీసుకున్నా కూడా డీబీటీ, నాన్‌ డీబీటీ తీసుకున్నా కూడా ఇదే బాధ్యతతో అడుగులు వేశామని, రాష్ట్రవ్యాప్తంగా 35 పథకాలు పైగా మీ బిడ్డ ప్రభుత్వంలో అమలు అవుతున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. పేదవాడి మీద ఉన్న ప్రేమతో వారి జీవితాలను మార్చాలని తపనతో ఈ 52 నెలల పాలనలో అడుగులు వేశామని అన్నారు. కానీ గత ప్రభుత్వం ఏనాడు పేదలపై ప్రేమ, బాధ్యత చూపలేదని, మనం అధికారంలోకి వచ్చే నాటికి అక్షరాల కోటిమందికి పైగా సొంతిళ్లు లేని నిరుపేదలు కనిపించారని, ఇప్పుడు అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడని, ఈ రోజు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు తేడాను గమనించాలని కోరారు.

“ఋషులు, మునులు, దేవతలు మంచి కోసం యజ్జం చేస్తుంటే రాక్షసులు కుట్రలు చేస్తారని విన్నాం. నిజంగా ఇలాగే మనందరి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే..ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఏకంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని కోర్టుల దాకా వెళ్లి కేసులు వేసి ఆపాలనే ప్రయత్నాలు ఎన్నో చేశారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడానికి మీ బిడ్డ తపన, తాపత్రయంతో అడుగులు వేస్తుంటే ఎన్నో అవరోధాలు కల్గించారు. మీ బిడ్డ ప్రభుత్వం రాగానే కోవిడ్‌ వచ్చింది. రెండేళ్ల పాటు రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. కోవిడ్‌ నియంత్రణకు ఖర్చులు పెరిగాయి. కానీ ఎక్కడా కూడా కారణాలు చెప్పలేదు. మీ బిడ్డ ఏదో ఒకటి చేసి మీ ముఖాల్లో చిరునవ్వులు చూడాలని అడుగులు వేశాడు.”- అని సీఎం జగన్ చెప్పారు

మీ బిడ్డకు మనసు ఉంది, ప్రజల పట్ల బాధ్యత ఉంది
ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు చూడాలని తపన, తాపత్రయంతో కనివీని ఎరుగని విధంగా 77 వేల ఎకరాలు సేకరించి 30.70 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని సీఎం తెలిపారు. వాస్తవానికి ఆ 31 లక్షల ఇళ్ల పట్టాల మార్కెట్‌ విలువ ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటిస్థలం విలువ రూ.2 లక్షల నుంచి 12 లక్షల వరకు విలువ ఉందని, 31 లక్షల ఇళ్ల విలువ కేవలం రూ.2 లక్షలు అనుకున్నా అక్షరాల రూ. 75 వేల కోట్లు ఉంటుందని సీఎం చెప్పారు. అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమంలో 22 లక్షల ఇళ్లు ఈ రోజు వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, ప్రతి పేదవాడికి రూ.2.70 లక్షల వ్యయం అవుతుందని, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తున్నామని, మరో 30 వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చామని, ప్రతి ఒక్కరికి మంచి జరిగిస్తూ ఉచితంగా ఇసుకను ఇస్తున్నామని దీని విలువ రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్, తదితర నిర్మాణ సామాగ్రి ధర తగ్గించి ఇస్తున్నామని, దీని విలువ మరో రూ.40 వేలు ఉంటుందని, ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కాలనీల మధ్య డ్రైనేజీ, నీటిసరఫరా, కరెంటు సరఫరాకు మరో రూ.32 వేల కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. ఇన్నివేల కోట్లు ఖర్చు చేస్తూ పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నామని, ఇన్నీ జరగాలంటే కేవలం ముఖ్యమంత్రే మారాడని, ఆనాడు ముఖ్యమంత్రికి, ఈ ముఖ్యమంత్రికి తేడాగమనించాలని కోరారు, మీ బిడ్డకు మనసుందని, మీపై ప్రేమ, బాధ్యత ఉన్నాయిని తెలిపారు.

చంద్రబాబుకు, కొడుకు, బావమరిది, ఎల్లో మీడయాకు రాష్ట్రంలో ఇల్లు ఎక్కడ ఉంది.. కనీసం కుప్పంలో కూడా లేదు
2014–2019 పాలన చూస్తే కనీసం పేదవాడికి ఒక సెంట్‌ స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేని సీఎం ధ్వజమెత్తారు. చంద్రబాబుకు వేల కోట్ల సంపద ఉందని కానీ, తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు ఒక్క సెంట్‌ స్థలం కూడా ఇవ్వలేకపోయాడని విమర్శించారు. అదే కుప్పంలో నేడు 20 వేల ఇళ్ల పట్టాలు, 8 వేల ఇళ్ల నిర్మాణాలు జరిగాయని అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారని, 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడని అయినా కూడా అక్కడ పెదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించాలంటే, ప్రతి గడపకు మంచి జరిగింది ఎప్పుడూ అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తరువాతే జరిగిందని అన్నారు. “గత ఐదేళ్లలో మీరే చూసి ఉంటారు. మీ బిడ్డ ప్రభుత్వం 52 నెలలుగా ఉంది. చంద్రబాబు అనే వ్యక్తి కంటిన్యూస్‌గా ఒక నెల అయినా రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించలేదు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం ఆయనకు గాని, ఆయనను సమర్ధించేవారికి మన రాష్ట్రంపై ప్రేమ ఉందా అని అడుగుతున్నా..వీరేవ్వరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. ఆయన పార్ట్‌నర్‌ దత్తపుత్రుడు రాష్ట్రంలో ఉండడు. ఆయన కొడుకు, ఆయన బావ మరిది ఉండడు. ఆయన గజదొంగల ముఠాలో పార్ట్‌నర్లు ఈనాడు రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు మన రాష్ట్రంలో ఉండరు. వీరికి మన రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలంటే ఏపీని దోచుకోవడానికి, దోచుకున్నది హైదరాబాద్‌లో పంచుకునేందుకు మన రాష్ట్రం కావాలి. ఇది వీరికి మన రాష్ట్రంపై ఉన్న ప్రేమ. ఇవన్నీ నిజాలు అవునా కాదా ఆలోచన చేయండి” అని సీఎం తెలిపారు.

సొంత పార్టీని, సొంత వర్గాన్ని, అభిమానులను హోల్ సేల్‌గా అమ్మటానికే వ్యాపారి పవన్ పర్యాటనలు
దత్తపుత్రుడి ఇళ్లు హైదరాబాద్‌లోనే శాశ్వతంగా ఉన్నాయని, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడేళ్లకు ఒకసారి మారిపోతుంటారని సీఎం ఎద్దేవా చేశారు. మహిళలపై కాని, పెళ్లిళ్ల వ్యవస్థ పై కానీ పవన్ కు గౌరవం లేదని ఇలాంటి వ్యక్తి నాయకుడిగా ఎలా నమ్ముతారని సీఎం విమర్శించారు. ఈ ప్యాకేజీ స్టార్‌ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం, గాజువాకతో కూడా సంబంధం లేదని, కేవలం ఈ నియోజకవర్గాలను పనిముట్లుగా చూసి యూజ్‌ అండ్‌త్రోగానే భావిస్తారని ఆరోపించారు. అంతేకాకుండా తన అభిమానుల ఓట్లు హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటారని దుయ్యబట్టారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారి పవన్ అని ఆరోపించారు. మన రాష్ట్రమైనా, మన ప్రజలైనా, మన కాపులైనా ఇలాంటి వ్యక్తికి ఏమీ ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలని సీఎం కోరారు. వీరందరిది కూడా ఒక్కటే మనస్తత్వమని, వీరికి అధికారం కావాల్సింది, వీరు దోచుకున్నది హైదరాబాద్‌లో పంచుకోవడానికేనని, ఇదీ మన రాష్ట్రంపై వీరికి ఉన్న ప్రేమ అని ప్రజలు ఆలోచించాలని తెలిపారు. మన రాష్ట్రంపై ప్రేమ లేని వారు.. మన రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేని వారు, మన రాష్ట్రంలో కనిపించని వారు అనుక్షణం మన రాష్ట్రం గురించి మాట్లాడుతుంటారని, కోపంతో ఊగిపోతుంటారని, అధికారం చంద్రబాబుకు పోయే సరికి వీరందరికీ ఫ్యూజులు పోతాయని సీఎం విమర్శించారు.

మన మట్టికి, మన మనుషులకు అనుబంధంలేని వ్యక్తులు వీరు
“ఈ రోజు మన మట్టితో కానీ, మన మనుషులతో ఏరకమైన బంధం, అనుబంధం లేదు. వీరంతా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమేచేస్తారు. మన ఎస్సీలను నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని కూడా వీరు చెప్పుకోలేరు. చివరికి కాపులను కూడా నా కాపులు అని కూడా చెప్పుకోలేరు. నా పేదవాడు అని కూడా చెప్పుకోలేరు. ప్రేమ, అనురాగం,బాధ్యత వీరు చూపరు. పైపెచ్చు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అంటారు. పేదలకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు వద్దంటారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేస్తారు. మన గురించి వీరికి పట్టనే పట్టదు. వీరి మనిషి సీఎంగా లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత మంచి చేసినా కూడా మంటలు పెట్టి చలి కాసుకోవాలని చూస్తారు. ఎంతటి దుర్మార్గాలు చేస్తున్నా కూడా అందరూ చంద్రబాబును సమర్ధిస్తారు. మసి పూసి మారడి కాయ చేస్తారు.” సీఎం జగన్ అన్నారు.

రాజకీయాలు అంటే అర్థం చనిపోయిన తరువాత కూడా బతకాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేయటమని, దీన్నే రాజకీయం అంటారని, విలువలు, విశ్వసనీయత అంటారని సీఎం చెప్పారు. చెప్పాడంటే చేస్తాడని అంటారని, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిలబడతాడు అన్నవాడే రాజకీయ నాయకుడని, అలాంటి విలువలు, విశ్వసనీయత వీరికి ఉందా? అని సీఎం ప్రశ్నించారు. జగన్​ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుందని చెప్పారు. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంద‌ని ఆరోపించారు.