NewsNews Alert

మునుగోడులో పరుగులు పెడుతున్న అభివృద్ధి

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మారుతోన్న రూపురేఖలు
నియోజకవర్గంలో కన్పిస్తోన్న స్పష్టత
రాజీనామా చేస్తేనే అభివృద్ధి చేస్తారని రుజవు
మునుగోడు తీర్పు కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

మునుగోడు రాజకీయాలపై ఎవరి లెక్కలు వాళ్లేసుకుంటున్నారు. కానీ మునుగోడులో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి… అదీ కూడా బీజేపీ నుంచే అని ముందుగానే డిసైడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందుకు ఏడాదిన్నరగా స్కెచ్ వేసుకుంటున్నారు. మునుగోడులో గెలుస్తామో.. ఓడతామో అన్నది తెలియకుండా రాజగోపాల్ రెడ్డి రాజకీయం చేస్తారని ఊహించడం కష్టం. రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఒక్కో స్టెప్ ఎక్కుతూ.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటాడు. దూకుడు రాజకీయాలు మాత్రం కొన్నిసార్లు లాభాన్ని.. మరికొన్నిసార్లు నష్టాన్ని కూడా కలిగిస్తాయి. అయితే రాజకీయ నాయకుడు కొన్నిసార్లు నష్టం వస్తోందని తెలిసి కూడా అడుగు ముందుకు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయాలనేవి ఊహించడానికి చాలా కష్టంగా ఉంటాయి. అలా ఇప్పుడు మునుగోడు ప్రజాతీర్పును కోరుతున్న రాజగోపాల్ రెడ్డి చేసిన సహసం తెలంగాణ రాజకీలను మేలిమలుపు తిప్పుతుందనడంలో సందేహం లేదు.

అనూహ్యంగా రాజకీయాల్లోకి రాజగోపాల్ రెడ్డి
వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లు మాత్రమే అయింది. అంతకు ముందు ఆయనో వ్యాపారవేత్త. కుటుంబంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేసి.. తొలి ఎన్నికలోనే సత్తా చాటారు. 2009 ఎన్నికల్లో భువనగిరి నుంచి విజయం సాధించి… అప్పటి వరకు నల్గొండ రాజకీయాల్లో ఉన్న వెంకట్ రెడ్డి పేరుకు ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ అన్న పదాన్ని జోడించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక్కరే ఎన్నికల బరిలోకి దిగారని చాలా మంది పొరపాటు పడుతున్నారు. గతంలో ఎంపీగా గెలిచినా.. ఎమ్మెల్సీగా గెలిచినా.. ఎమ్మెల్యేగా గెలిచినా.. రాజగోపాల్ రెడ్డి అర్ధ, అంగ బలాలు ఆయనను గెలుపుతీరాలకు చేర్చాయ్. కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటం అందుకు భిన్నమైనది. స్వతహాగా కాంగ్రెస్ నీళ్లు వంట బట్టించుకున్న రాజగోపాల్ రెడ్డి.. ఆ తర్వాత ఆ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టాలని భావించారు. ఒకానొక దశలో బ్రదర్ వెంకట్ రెడ్డిని కాదని… తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలవడం విన్నాం. చూశాం.

రేవంత్ రాకతో కాంగ్రెస్‌లో మారిన పరిణామాలు
2018 ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చేలా ముందుకు నడుపుతానంటూ ఆయన పార్టీ పెద్దలను వినమ్రపూర్వకంగా కోరారు. అందుకు కావాల్సిన ఆర్థిక వనరులను తయారు చేసుకుంటానని కూడా చెప్పారు. కానీ.. కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి మాట పడనివ్వలేదు. అయితేనేం.. కాంగ్రెస్ పార్టీ యోధానుయోధులు ఎన్నికల్లో ఓడినా… సొంత అన్నయ్య నల్గొండ నుంచి ఓడినా.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించి సత్తా చాటారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి డజనుకు పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా.. ఆయన మాత్రం ఇష్టమున్నా.. లేకున్నా పార్టీలోనే కొనసాగారు. అంతిమంగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ ముందుకు సాగారు. సొంత పార్టీలో మారుతున్న రాజకీయాలు… ఎదుర్కొన్న సంఘర్షణతో ఎలా ముందడుగేయాలన్నదానిపై తర్జనభర్జన పడ్డారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించారో నాటి నుంచి హస్తం పార్టీతో ఆయనకు దూరం పెరిగింది. తెలంగాణాలో కేసీఆర్‌ను ఓడించాలంటే ఆషామాషీ కాదన్నది ఆయన నమ్మకం. కేసీఆర్‌ను ఓడించాలంటే.. బీజేపీతో మాత్రమే సాధ్యమని.. మోదీ, అమిత్ షా నాయకత్వంలోనే ఆ కల సాకారమవుతుందని ఆయన మనసావాచా నమ్మారు.

అమిత్ షా ఆశీస్సులతో ముందడుగు
అందుకే ఓవైపు సొంతపార్టీలో లుకలుకలు… మరోవైపు కేసీఆర్ పాలనతో విసిగిపోయిన రాజగోపాల్ రెడ్డి… చివరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో నేతలు చేస్తున్న పేపర్ రాజీనామా కాకుండా… రియల్ రాజీనామా చేశారు. కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాలతో సమావేశమై పార్టీ కోసం తాను పనిచేయడానికి సిద్ధమని.. పార్టీ గట్టిగా ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో పార్టీని విజయ తీరాలకు చేర్పించగలననే నమ్మకాన్ని కలిగించారు. బీజేపీ అగ్రనేతల ఆశీస్సులతో మునుగోడు గడ్డపై అడుగుపెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా మునుగోడు ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చారు. నియోజక వర్గంలో 57 ఏళ్లు దాటిన వృద్ధులకు పింఛన్లు వస్తున్నాయ్. నియోజకవర్గంలో కొందరు దళితులకు దళితబంధు పథకం రాబోతోంది. ఇక మనుగోడులో ఆస్పత్రులు, స్కూళ్లన్నీ కూడా కళకళలాడుతున్నాయ్. రోడ్లన్నీ ధగధగ మెరిసిపోతున్నాయ్. మొత్తంగా మునుగోడు నియోజకవర్గం గురించి పట్టించుకోని అధికార పార్టీ ఇప్పుడు అంతిమంగా నియోజకవర్గానికి తరలివచ్చింది. ప్రజలకు ఏం కావాలో.. అర్హులెవరో లెక్కలు వేసుకొని మరీ సాయం చేసేందుకు ముందుకు కదులుతోంది.

నియోజకవర్గానికి అభివృద్ధి ఫలాలు
ఇలా జరగడం గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌లో మాత్రమే చూశాం. అవి కాకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలైన దుబ్బాక, సిరిసిల్ల, సిద్దిపేటల్లో మాత్రమే అభివృద్ది చేశారంటూ రాజగోపాల్ రెడ్డి చాన్నాళ్లుగా వాదిస్తూ వచ్చారు. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని… ఆ మూడు నియోజకవర్గాల్లోలా డెవలప్ చేస్తారా..? అంటూ అనేకసార్లు టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఇప్పుడాయన రాజీనామా చేయడంతో నియోజకవర్గంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభించాయ్. సొంతంగా ప్రజల కోసం ఎంతో ఖర్చు చేసిన రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు ప్రజలకు వందకు వంద శాతం మేలు జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ కాంట్రాక్టులకు ఆశపడి వెళ్లారని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు విమర్శించినా… వాస్తవమైతే మరోలా ఉంది కదా.. నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ గా మారబోతోంది కదా… మొత్తంగా రాజగోపాల్ రెడ్డి చూపించిన తోవ తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు ఆదర్శంగా మారబోతుందనడంలో సందేహం లేదు. తమను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేయలేనప్పుడు ఆ పదవి ఉన్నా.. లేకున్నా ఒకటే కదా… అందుకే ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు నిర్ణయాత్మక ఓటేసేందుకు గెట్ రెడీ అవుతున్నారు.