News Alert

భావి సమాజానికి మార్గ నిర్దేశకుడు ఉపాధ్యాయుడే

(రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం)

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు పెద్దలు. తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే అని దాని అర్థం. మనిషి పుట్టినప్పటినుంచి వేసే ప్రతి అడుగులో ఏదో ఒక అంశాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకునే ప్రతి అంశం వెనుక ఒక గురువు ఉంటాడు. ఆ గురువుని ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలోనే. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారిధిగా చేసుకొని ముందుకు సాగుతారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎవరికి కేటాయించనంత సమయాన్ని గురువు వద్ద గడుపుతారు. అలా తమ జీవితాలకు ఓరూపం కల్పించి తీర్చిదిద్దే గురువునే ప్రత్యక్ష దైవాలుగా అందరూ భావిస్తారు వారిని పూజిస్తారు.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎవరికి వారు తమ పాఠశాలలలో కాలేజీలలో విశ్వవిద్యాలయాల్లో గురువులను ఘనంగా సత్కరించి వారి రుణం తీర్చుకుంటూ ఉంటారు. మోడల్ స్కూలు అయిన, వీధి చివర సర్కారు బడి అయినా విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసేది ఉపాధ్యాయులే. విద్యా బోధన సృజనాత్మకత వృత్తి, చిన్నారుల చిట్టి బుర్రలను వికసింప చేయటం వారిని జ్ఞాన సంపన్నులుగా మార్చటం ఉపాధ్యాయుల కర్తవ్యం. ప్రతి సంవత్సరం స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా ఆరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా, గురుపూజోత్సవముగా జరుపుకుంటున్నాం.

భావి సమాజానికి దిక్సూచి నిర్దేశకుడు ఉపాధ్యాయుడే. శోధన పరిశోధన కోసం గూగుల్ వంటి దిగ్గజ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని పంచి జ్ఞాన త్రుష్టను పెంచే గురువుకు మించిన సాధకుడు ఉండడు. అందుకే మన హిందూ ధర్మాలు తల్లిదండ్రుల తర్వాత అత్యంత పవిత్రమైన స్థానాన్ని గురువుకే కట్టబెట్టాయి. నేటి ఆధునిక సమాజంలో ఉపాధ్యాయునికి విద్యాబోధన మాత్రమే కాదు, గురుతర బాధ్యతలు అనేవి తన వృత్తిలో భాగమయ్యాయి. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయడంతో పాటు వారిలో నైపుణ్యాలు పెంచి రేపటి సమాజాన్ని నడిపించే నాయకత్వ లక్షణాలు పెంపొందించే బాధ్యత కూడా విద్యలో భాగమయ్యింది. యుగాలు తరాలు మారిన గురు శిష్యుల బంధం మాత్రం మారదు. ఢిల్లీకి రాజైన గురువు ముందు శిష్యుడే.

సమాజంలో ఎంత అత్యున్నతస్థాయికి వెళ్లినా కూడా ఎవరైనా సరే తాము ఇంతటి స్థాయికి తీసుకువచ్చిన గురువులను మహనీయులను తరచు స్మరిస్తూనే ఉంటారు. వారిని కలిసినప్పుడల్లా నమస్కరించి వారి గురు భక్తిని చాటుకుంటూనే ఉంటారు. తమ తమ జీవితాల్లో తల్లిదండ్రులతో పాటు మర్చిపోలేని వ్యక్తులు గురువులదే. ప్రతి సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రభుత్వాలు కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందించి వారిని ఘనంగా సత్కరిస్తున్నాయి. ప్రతి ఏటా లాగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 176 మందిని ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో ఈసారి ఐదుగురికి జాతీయస్థాయి అవార్డులను అందించనుంది.