Andhra PradeshNews

మేనిఫెస్టోలో ఉన్న 95 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చాం: జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఇవాళ పర్యటించారు. ఆ ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని, ఆ ప్రాజెక్టులో రెండు టన్నెళ్ల పనులు జరుగుతున్నాయని అన్నారు.


తాము గ్రానైట్‌ పరిశ్రమలో మళ్ళీ స్లాబ్‌ సిస్టమ్‌ తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పేదలు, రైతులు సంక్షేమం అంటే మొదట మహనేత వైఎస్సార్‌ గుర్తొస్తారని, ఆయన బిడ్డగా తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని అన్నారు. తాము మేనిఫెస్టోలో ఉన్న 95 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. తాము ఇచ్చిన హామీ మేరకు చిన్న పరిశ్రమలకు మేలు జరిగేలా నిర్ణయాలు అమలు చేయబోతున్నామని జగన్ చెప్పారు. చిన్న గ్రానైట్‌ పరిశ్రమలకు విద్యుత్తు ఛార్జీల్లో రూ.2 తగ్గింపు ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఒంగోలులో శిథిలావస్థలో ఉన్నజిల్లా పరిషత్‌ ఆఫీసుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు.