Andhra PradeshNationalNews

బెజవాడలో బీజేపీ వ్యూహాలు.. పార్టీలో చేరేందుకు కేశినేని ప్రయత్నాలు

తెలంగాణలో అధికారంలోకి రావాలి. ఏపీలో బలీయమైన శక్తిగా ఎదగాలి. దక్షిణాదిలో చక్రం తిప్పాలి. ఇది కమలనాధుల వ్యూహం. ఈ దిశగా జోరుగా పావులు కదుపుతోంది. ప్రయత్నాల కృషి ఫలిస్తోంది. బీజేపీ విధానాలకు, సిద్ధాంతాలకు, మోదీ పథకాలకు, పరిపాలనా తీరుకు ఎంతో మంది ఆకర్షితులవుతున్నారు. పార్టీలో చేరుతున్నారు. ఇదే ఇప్పుడు బిజీపీయేతర పార్టీలకు మింగుడు పడ్డం లేదు. ఎక్కడ తమ కొంపలు కొల్లేర్లు అవుతాయా అని భయపడి పోతున్నాయి. ఇక రానున్న భవిష్యత్ అంతా బీజేపీదే అన్న అభిప్రాయంతో గోడదూకి వచ్చే వాళ్ళు వచ్చేస్తున్నారు. పార్టీలో చేరేవారు చేరి పోతూనే ఉన్నారు. ఈ దూకుళ్ళు ఎక్కువగా తెలంగాణలో కనిపిస్తుంటే.. ఇప్పుడు ఏపీలో కూడా జోరు పెరగబోతోంది. ఇందుకు సంబంధించి తెర వెనుక పెద్ద ఎత్తున మంత్రాంగం నడుస్తోంది.


పటిష్టంగా ఉంది. బలీయమైన శక్తిగా ఎదిగింది. ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాలలో జెండా ఎగరేసింది. అధికార పీఠంపై వైభవంగా వెలిగిపోతోంది. చివరికి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అమేయ బలాన్ని కూడగట్టుకుంది. మధ్య భారతాన్నంతా తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. ఇక దక్షిణాదిపైనే గురి పెట్టింది. ఎన్నో ఏళ్ళుగా సౌత్ ను ఏలాలని కమలనాధుల కాంక్ష. కానీ నెరవేరడం లేదు. ఒక్క కర్నాటక మినహా ఎక్కడా చెప్పుకోతగ్గ బలాన్ని సంపాదించుకోలేక పోయింది. కానీ.. ఇప్పుడు తెలంగాణపై ఎన్నో ఆశలు చిగురిస్తున్నాయి. బూత్ స్ధాయి నుండి పార్టీ బాగా వేళ్ళూనుకుంది. నియోజకవర్గాల్లో శక్తిని సంపాదించుకుంది. గ్రేటర్ లో పాగా వేసింది. అత్యధిక వార్డులను గెలుచుకుంది. మూడు అసెంబ్లీ స్ధానాలను, రెండు పార్లమెంట్ స్ధానాలను కైవసం చేసుకుంది. రానున్న ఎన్నికల్లో ఇక అధికార పీఠం తమదే అన్న ధీమాతో ఉంది బీజేపీ. తెలంగాణలో అనుసరిస్తున్న విధానాలనే ఏపీలో కూడా అప్లై చేయబోతోంది.


నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. ఏ పార్టీకైనా ఇప్పుడు ప్రత్యామ్నాయం బీజేయే అయ్యింది. ఇప్పుడు తన గురి ఏపీ పై పెట్టింది. జనసేనతో కలిసి తన బలాన్ని పెంచుకునేందుకు ఉబలాటపడుతోంది. అనేక మంది నేతలు కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు ఆరాటం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని చూపు కమలం పై పడింది. రేపోమాపో చాప చుట్టేసి కాషాయం గూటికి చేరేందుకు తహతహ లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయనకు సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు. తన తమ్ముడు చిన్నిని తనకు శత్రువుగా చేసి .. పార్టీలో తనకు ప్రత్యామ్నాయ శక్తిగా పెంచారన్న కోపంతో ఉన్నాడు నాని. పైగా పార్టీ కూడా పెద్దగా ఆయనను పట్టించుకోవడం మానేసింది. దీంతో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న నాని .. తనకు హామీలిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమే నంటూ బీజేపీకి ఆఫర్ పంపించాడుట.


2014లో టీడీపీలో చేరిన నాని మాంచి దూకుడును ప్రదర్శించి ఎంపీ టికెట్ కొట్టేశాడు. 2019 ఎన్నికల్లోనూ.. వైసీపీ హోరు గాలిలో గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించాడు. బెజవాడలో తనకు ఎదురు లేదని చాటాడు. కానీ.. టీడీపీ మాత్రం అతన్ని దూరం పెడుతూ వచ్చింది. చంద్రబాబు ఇమేజ్ తో గెలిచారు అంటే అస్సలు ఊరుకోడు నాని. తన శక్తి సామర్ద్యాలే తనను గెలిపించాయని అంటాడు. ఇక గెలిచాక .. అన్ని పార్టీలతోనూ సన్నిహితంగా ఉంటున్న నాని.. బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీతో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. అది స్నేహంగా మారింది. ఆ స్నేహ ఫలితమే ఆయనను బీజేపీకి గూటికి చేరుస్తోందని ఆయన అభిమానుల్లో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం ఆయన కుటుంబంలో కుమార్తె శ్వేత కూడా రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. తండ్రితో పాటు అమె కూడా బీజేపీ తీర్ధం తీసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సీటుకు తాను.. విజయవాడ తూర్పు అసెంబ్లీ స్ధానం నుండి శ్వేత బీజేపీ తరపున పోటీ చేసేందుకు రంగం కూడా చేసుకుంటున్నారని ప్రచారం ఉంది. ఎన్నికలకు ఎంతో దూరం ఉంది. ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. ఇక ఎన్నికల తేదీలు ప్రకటిస్తే .. కమలదళంలో సందడే సందడి.