WEATHER WOMEN OF INDIA మన అన్నామణి
గూగుల్ డూడుల్ మనందరకూ సుపరిచితమే. ప్రతిరోజూ ఒక ప్రత్యేకతతో వచ్చే ఈ డూడుల్‌లో ఈరోజు మన భారత తొలితరం మహిళా శాస్త్రవేత్త అయిన అన్నామణి గారి గురించి ఆమె 104 వ జయంతిని పునస్కరించుకుని ప్రచురించడం మనందరకూ గర్వకారణం.

చదువుపై మమకారం
ఈనాడు మనం వర్షాలు, తుపానులపై ఖచ్చితమైన అంచనాలు వేస్తున్నామంటే దానికి పునాది వేసిన చేయి ఆమెదే. ఆమె కేరళలోని పీర్మేడు గ్రామంలో 1918 ఆగస్టు 23న జన్మించింది. ఆమెకు చిన్నతనం నుండి చదువంటే ఎంతో మక్కువ. ఆమె సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. ఆమెది సంప్రదాయ ఎగువ మధ్యతరగతి కుటుంబం. ఆకాలంలో అమ్మాయిలను ఉన్నత చదువులకు పంపకుండా చిన్నవయస్సులోనే పెళ్లి చేసేసేవారు. కానీ ఆమె చదువుపై మమకారంతో కుటుంబంతో పోట్లాడి, ఉన్నత చదువులకు విదేశాలకు కూడా వెళ్లారు. చిన్నప్పటినుండీ పుస్తకాలపురుగులా చదువుతూనే ఉండేవారు. 12 ఏళ్లకే తమ ప్రాంతంలో పబ్లిక్ లైబ్రరీలో పుస్తకాలన్నింటినీ చదివేశారు. తల్లిదండ్రులు ఎనిమిదేళ్లవయస్సులోనే తనకు వజ్రాల చెవిపోగులు ఇవ్వబోతే వద్దని, తనకు ఎన్ సైక్లోపిడియా బ్రిటానికా పుస్తకం కావాలని పట్టుబట్టారు.

సైన్సు పరిశోధనలు
చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీలో బీఎస్సీ ఆనర్స్ పూర్తిచేసి, తర్వాత ఇండియన్ ఇనిస్టట్యూట్ ఆఫ్ సైన్స్‌లో స్కాలర్ షిప్ కూడా పొందారు. తర్వాత నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ సీవీ రామన్ వద్ద కొంతకాలం రూబీ, వజ్రాలపై పరిశోధనలు చేసారు. తర్వాత మాస్టర్స్ కోసం లండన్ ఇంపీరియల్ కాలేజీకి వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లాక ఆమెకు వాతావరణ శాస్త్రం పట్ల ఆసక్తి పెరిగింది. అక్కడ ఈ విభాగంలో స్పెషలైజేషన్ చేసి అనంతరం భారత్ తిరిగొచ్చి పుణెలోని వాతావరణ శాఖలో చేరారు. భారత్ ఎక్కువగా బ్రిటన్‌పై ఆధారపడాల్సి వస్తోందని గమనించి స్వదేశీ పరికరాల కోసం కృషి చేస్తోంది. దాదాపు 100 పరికరాలను దేశంలోనే తయారుచేసుకునే విధంగా ప్రమాణాలను రూపొందించారు. గాలి వేగం, సౌరవిద్యుత్‌ను కొలిచేందుకు ఎన్నో పరికరాలు రూపొందించారు. ఆమె పరిశోధనలు నేటి వాతావరణశాఖ ఖచ్చితమైన అంచనాలకు పునాదులు వేసాయి.

అవార్డులు-రివార్డులు
ఆమె ఈ రంగంలో చేసిన కృషికి గాను అన్నామణిని వెదర్ విమెన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. రామనాధన్ అవార్డు, ఇంకా పలు అవార్డులు కూడా ఆమెను వరించాయి. ఆమె చిన్ననాటినుండీ గాంధేయవాది. కేవలం ఖాదీ వస్త్రాలనే ధరించేవారు. వివాహం కూడా చేసుకోకుండా పూర్తిగా దేశసేవకే అంకితమై 1976 లో భారత వాతావరణ శాఖ డిప్యూటీ డైరక్టర్‌గా పదవీ విరమణ చేసారు. 2001లో తన 83 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కన్ను మూసారు. ఈమె ఆధునిక భావజాలం, ఆమెకు నచ్చిన రంగంలో చేసిన కృషి భారతమహిళలందరికీ ఎంతో ఆదర్శప్రాయం.

