ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారత్ టాప్ 3
భారతదేశంలో కుబేరుల సంఖ్య ఊహించని వేగంతో పెరుగుతోంది. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మన దేశం 3వ స్థానంలో నిలిచింది. నైట్‌ఫ్రాంక్ ‘వెల్త్ రిపోర్ట్-2026’ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నులు ఉన్న దేశాల జాబితాలో భారత్ 6వ స్థానానికి చేరుకుంది. 30 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తులున్న వారి సంఖ్య మన దేశంలో ప్రస్తుతం 19,877 కు చేరింది. దేశంలో ప్రస్తుతం 207 మంది బిలియనీర్లు ఉన్నారు. 2021 నుంచి 2026 మధ్య కాలంలో భారత సంపన్నుల సంఖ్య 63.4 శాతం పెరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు కావడం విశేషం. టెక్నాలజీ, ఆర్థిక సేవలు, స్టాక్ మార్కెట్లు ఈ సంపద సృష్టికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా సంపన్నుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో సగటున ప్రతిరోజూ 89 మంది కొత్త వ్యక్తులు అత్యంత సంపన్నుల జాబితాలో చేరుతున్నారు. యుద్ధాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంపద సృష్టి మాత్రం ఆగడం లేదు. వచ్చే ఐదేళ్లలో భారత బిలియనీర్ల సంఖ్య మరో 51 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. సంపన్నులు ఎక్కువగా ఉన్న నగరాల్లో ముంబై (35.4%) ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. అయితే, ఇతర నగరాలు కూడా వేగంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ వాటా గతంలో 5 శాతంగా ఉండగా, ఇప్పుడు అది 6.3 శాతానికి పెరిగింది. ఢిల్లీ, చెన్నై నగరాల్లో కూడా సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం.

