Andhra PradeshHome Page Sliderhome page slider

ఏపీ రాజకీయాల్లో ‘వైసీపీ’ వికెట్ పడనుందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. వైఎస్ జగన్ కోటరీపై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం ఎక్స్‌ వేదికగా చేసిన వివాదాస్పద ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో త్వరలోనే అనేక సంచలన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని బాంబు పేల్చారు. “గత జగన్ ప్రభుత్వంలో కేవలం లిక్కర్ అవినీతి మాత్రమే జరగలేదు, లెక్కలేనన్ని అరాచకాలు సాగాయి. వాటన్నింటికీ శిక్ష అనుభవించాల్సిన సమయం ఆసన్నమైంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే విచారణ ముమ్మరం చేసింది, బాధ్యులెవరూ తప్పించుకోలేరు,” అని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే లిక్కర్ స్కామ్ ,ఇతర అక్రమాల కేసుల్లో పలువురు వైసీపీ నేతలు, మాజీ మంత్రులు జైలు పాలయ్యారు. అయితే, మాధవ్ తాజా వ్యాఖ్యలు గమనిస్తుంటే, ఈసారి దర్యాప్తు సంస్థల గురి నేరుగా పార్టీలోని ‘పెద్ద తలకాయల’ పైనే ఉందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఒకవైపు విజయసాయిరెడ్డి తన సొంత పార్టీలోని కోటరీపై అసంతృప్తి వెళ్లగక్కడం, అదే సమయంలో బీజేపీ నేత ‘సంచలనాలు’ జరగబోతున్నాయని చెప్పడం యాధృచ్ఛికం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయసాయిరెడ్డి ట్వీట్‌తో ఇప్పటికే వైసీపీలో రచ్చ మొదలవగా, ఇప్పుడు బీజేపీ నేత హెచ్చరికలు పార్టీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి. ప్రభుత్వం దగ్గర ఉన్న పక్కా ఆధారాలతోనే మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే విచారణ సంస్థలు తమ తదుపరి చర్యలను వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది.