భార్యకు విడాకులు.. మాజీ సీఎం అఖిలేష్ సోదరుడు ఆవేదన
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయమ్ సింగ్ యాదవ్ కుటుంబంలో తలెత్తిన విభేదాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సోదరుడైన ప్రతీక్ యాదవ్ తన భార్య అపర్ణ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టడంతో వైరల్ గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అపర్ణ ఫొటోను షేర్ చేసిన ప్రతీక్ ‘ఫ్యామిలీ డిస్ట్రాయర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. తన కుటుంబ బంధాలను ఆమె పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అపర్ణకు పేరు, ప్రాచుర్యమే ముఖ్యమని, కుటుంబం గురించి ఆమెకు పట్టింపులేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన మానసిక పరిస్థితి బాగోలేకపోయినా ఆమె పట్టించుకోవడం లేదని, ఆమె తన గురించే మాత్రమే ఆలోచిస్తుందని విమర్శించారు. ఇలాంటి చెడ్డ వ్యక్తిని జీవితంలో చూడలేదని, ఆమెను పెళ్లి చేసుకోవడం తన దురదృష్టమని ప్రతీక్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ప్రతీక్, అపర్ణలు 2011లో వివాహం చేసుకున్నారు. 2017లో అపర్ణ ఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2022లో బీజేపీలో చేరి చురుగ్గా పనిచేశారు. 2024 సెప్టెంబరులో బీజేపీ రాష్ట్ర మహిళా కమిషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ వివాదంపై ఎస్పీ గానీ, బీజేపీ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

