‘ఐబొమ్మ’ కేసులో కొత్త పేరు
తెలుగు చిత్ర పరిశ్రమను వణికించిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రహ్లాద్ వెల్లేల అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పత్రాలను ఉపయోగించి రవి తన కార్యకలాపాలు సాగించినట్లు విచారణలో తేలింది. ప్రహ్లాద్ పేరు మీద రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు గుర్తించిన పోలీసులు, బెంగళూరులో ఉంటున్న ప్రహ్లాద్‌ను పిలిపించి విచారించారు. గతంలో రవి ప్రహ్లాద్ తన రూమ్‌మేట్ అని చెప్పినప్పటికీ, విచారణలో ప్రహ్లాద్ మాత్రం తనకు రవి ఎవరో తెలియదని, తన డాక్యుమెంట్లను దొంగిలించి ఇలా వాడటం చూసి షాక్‌కు గురయ్యానని పోలీసులకు తెలిపాడు. రేపటితో రవి పోలీసు కస్టడీ ముగియనుండటంతో, ఈ కేసులో ఇంకెన్ని కొత్త కోణాలు బయటపడతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

